భారత్ లో పెరుగుతున్న కరోనా మృతులు
24 గంటల్లో 47 మంది మృతి… పెరుగుతున్న రికవరీ రేటు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,336 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. దీంతో మహమ్మారి సోకిన వారి సంఖ్య 18,601కి చేరింది. ఇక కొత్తగా 47 మంది కన్నుమూయడంతో మరణాల సంఖ్య 590కి చేరింది. ఇక ఇప్పటి వరకు 3251 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతుండడం ఊరటనిచ్చే విషయం. గత 24 గంటల్లో రికవరీ రేటు 17.48శాతంగా నమోదైనట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం ఇది 14.75శాతం, ఆదివారం 14.19శాతం, శనివారం 13.85శాతం, శుక్రవారం 13.06శాతం, గురువారం 12.02శాతం, బుధవారం 11.41శాతం, మంగళవారం 9.99శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్ విజృంభణతో మహారాష్ట్ర విలవిల్లాడిపోతోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 4,666 మందిలో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 572 మంది కోలుకోగా.. 232 మంది కన్నుమూశారు. ఆ తర్వాత దిల్లీలో 2,081, గుజరాత్ లో 1,939, రాజస్థాన్లో 1,576, తమిళనాడులో 1,520, మధ్యప్రదేశ్ లో 1,485 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. కరోనా వైరసను నిర్ధారించడానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ చేస్తున్న పరీక్ష ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోందని రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. ఈ సమస్యను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. ఫలితాల్లో 90 శాతం కచ్చితత్వం వస్తుందని అంచనా వేస్తే.. కేవలం 5.4 శాతం వస్తోందని, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రఘు శర్మ అన్నారు. “సలహా కమిటీ సూచనల మేరకు ర్యాపిడ్ టెస్టింగ్ కిను వినియోగించడాన్ని నిలిపివేశాం. ఐసీఎంఆర్ కు ఈ సమస్య గురించి తెలియజేశాం. వారి నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం” అని శర్మ తెలిపారు. పీసీఆర్ తో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకిందని తేలిన వారికి ర్యాపిడ్ కిట్స్ పరీక్షలు నిర్వహించామని, కానీ ఫలితాల్లో నెగిటివ్ అని వస్తోందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నుంచి స్పందన సానుకూలంగా వస్తే, కిట్టు తిరిగి వెనక్కి పంపిస్తామని వెల్లడించారు. రాజస్థాన్ లోని హాట్ స్పాట్స్ లో శుక్రవారం నుంచి ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్స్ కిట్స్ తో పరీక్షలు నిర్వహిస్తోంది. ర్యాపిడ్ టెస్టులో నమూనాగా వేలి నుంచి రక్తం తీసి పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా కరోనా సోకిన ఆనవాళ్లు ఉన్నాయని వేగంగా గుర్తిస్తారు. అయితే ఈ టెస్టుతో వైరస్ సోకిందని నిర్ధారణకు రాలేం, పీసీఆర్ టెస్టు మాత్రమే కరోనా సోకిందని తెలుస్తుంది. రాజస్థాన్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తురిస్తున్నది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నానికే కొత్తగా 83 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1659కి చేరింది. ఇక మరణాలు కూడా మెల్లగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి 25 మంది మృతిచెందారు. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా జైపూర్ లో 648 కేసులు నమోదు కాగా, 265 కేసులతో జోధ్ పూర్, 102 కేసులతో భరత్ పూర్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.