మేధావులు సమాయాత్తం కావాలి

కరోనా కట్టడి పై రాహుల్ గాంధీ కేంద్రానికి సూచనలు

న్యూఢిల్లీ: కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ శనివారం ట్విటర్ వేదికగా పలు సూచనలు చేశారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం భారీ సవాలే అయినప్పటికీ… సంక్షోభం నుంచి గట్టెక్కడానికి నూతన పరిష్కారాల ఆన్వేషణకు ఇది మంచి అవకాశమన్నారు. ఇందుకోసం భారతీయ నిపుణుల సంఘాలు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, డేటా నిపుణులను సమాయత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు. దేశంలో కరోనా పరిస్థితులపై రాహుల్ గాంధీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరు పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. “కరోనాతో యుద్ధంలో మనుకున్న ఏకైక ఆయుధం కరోనా పరీక్షలే. ప్రస్తుతం ఈ కరోనా పరీక్షలు దేశంలో చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. వ్యూహత్మకంగా పరీక్షలు నిర్వహించట్లేదు. ర్యాపిడ్ టెస్టు వీలైంత ఎక్కువగా చేయాల్సిన అవసరముంది. కరోనా పరీక్షలు పెంచకపోతే మళ్లీ మనం లాక్ డౌన్లోకి వెళ్లాల్సి ఉంటుంది”అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. కరోనా నియంత్రణలో భాగంగా ప్రధానమంత్రి తీసుకుంటున్న కొన్ని చర్యలతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం రాజకీయాలు చేసే సమయం కాదని, అందరం కలిసికట్టుగా కరోనా పై పోరాడాలని చెప్పారు. తమ బాధ్యతగా వ్యూహాత్మక సూచనలు ఇస్తున్నామని, ఆచరించడం.. ఆచరించకపోవడం ప్రభుత్వం ఇష్టమని రాహుల్ గాంధీ అన్నారు.