ఆదాయ పన్ను శాఖకు ప్రశంసలు

ఆర్థిక వెసలుబాటు పై మోదీ ట్వీట్

హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఆర్థిక వెసలుబాటును ఆయన మెచ్చుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ట్వీట్ ను శనివారం రిట్వీట్ చేసిన మోదీ.. దేశంలో ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. సుమారు 5204 కోట్ల విలువైన ఐటీ రిఫండ్స్ ను ఎంఎస్ఎంఈలకు సెంట్రల్ బోర్డు ఇచ్చినట్లు సీబీడీటీ తన మీడియా ప్రకటనలో పేర్కొన్నది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి సుమారు 8.2 లక్షల చిన్న వ్యాపారులను ఆదుకున్నట్లు తెలిపింది. తాము ఇచ్చిన రిఫండ్స్ తో.. చిన్న పరిశ్రమలు తమ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అని, ఎటువంటి జీతాల కోత కానీ, ఉద్యోగుల తొలగింపు కాని ఉండదని సీబీడీటీ పేర్కొన్నది. సుమారు 14 లక్షల పన్నుదారులకు రిఫండ్స్ కల్పించినట్లు సెంట్రల్ బోర్డు తెలిపింది. వీలైనంత తర్వగా మళ్లీ 7760 కోట్ల విలువైన రిఫండ్స్ చేయనున్నట్లు సీబీడీటీ చెప్పింది.