ఆర్థిక సంక్షోభం తప్పదు

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరిక

వాషింగ్టన్: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘తీవ్ర ఆర్థిక మాంద్యం’ ఎదుర్కోబోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. కరోనాకు పూర్వం మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థికం 2020లో తీవ్ర సంక్షోభం చవిచూడబోతోందని పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులకు ఇది అతి పెద్ద సవాలు కానుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జియోవా పేర్కొన్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రపంచ ఆర్థికంలో పెద్దఎత్తున కోత తప్పదని హెచ్చరించారు. వాణిజ్య వివాదాలు, రాజకీయ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉందని క్రిస్టిలినా పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా కారణంగా 2020లో తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతోందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోని శాసనకర్తలకు కరోనా మహమ్మారి విసిరిన పంజాను ఎదుర్కోవడం సవాలేనని అభిప్రాయపడ్డారు. ఇదివరకే ఈ మహమ్మారి బారిన పడిన అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కోల్పోయామని, ఆయా దేశాల్లో పర్యాటకం దెబ్బతిందని, ఆహారం, మందులు వంటి సరకుల దిగుమతిలో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. తొలుత కరోనా వైరస్ బారిన పడిన దేశాలైన చైనా, దక్షిణ కొరియా, ఇటలీలో ఇప్పటికే తయారీ రంగం దెబ్బతిందని, సేవలు నిలిచిపోయాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది వ్యాక్సిన్ల అభివృద్ధి, థెరపీలు, సరఫరా గొలుసును పునురుద్ధరించడం వంటి అంశాల పై ఆధారపడి ఉంటుందని క్రిస్టలినా పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి మెరుగైన చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి ప్రారంభం అవుతుందన్నారు. 2021లో కోలుకోవడం ప్రారంభమైతే అదే ఏడాది చివరికి నాటికి కరోనా ముందు నాటి కంటే దిగువ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ మహమ్మారి కారణంగా మరిన్ని మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు క్రిస్టిలినా సూచించారు. మరణాల రేటు తగ్గించడడానికి, వైరస్ ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థికంగా ఇంకా వెనుకబాటులో ఉన్న దేశాలకు అంతర్జాతీయ సమాజం సాయం అందించాలని పిలుపునిచ్చారు.