కరోనా మరణాల రేటు 3.3 శాతం

కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 43 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 14,378కి చేరిందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 1992 మంది కోలుకున్నారని చెప్పారు. మొత్తం కేసుల్లో ఇది 13.85 శాతమన్నారు. దేశంలో కరోనా కారణంగా మరణాలు రేటు 3.3 శాతంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో వయసుల వారీగా చూస్తే 0-45 మధ్య వయసు ఉన్న వారు 14.4 శాతం మంది ఉన్నారని తెలిపారు. 45-60 వయసు గల వారు 10.3శాతంబీ 60-75 వయసు గల వారు 33.1 శాతంబీ 75 ఏళ్ల పైబడి వారు 42.2 శాతం మంది మరణించారని లవ్ అగర్వాల్ గణాంకాలతో వివరించారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో 83 శాతం మందికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 4,291 కేసులు ఒక్క తల్లిగీ జమాత్ సమ్మేళనానికి సంబంధించినవేనని తెలిపారు. దీనివల్ల 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో దీని ప్రభావం ఉందని చెప్పారు. తమిళనాడులో 84 శాతం, దిల్లీలో 63 శాతం, తెలంగాణలో 79 శాతం, ఏపీలో 61 శాతం, యూపీలో నమోదైన 59 శాతం కేసులు మర్కజ్ కు సంబంధించినవేనని అగర్వాల్ చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కారణంగా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.