భారత్ లో కరోనా
377 మరణాలు, 11,439 కేసులు
దిల్లీ: భారత్ లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 11వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 1076 పాజిటివ్ కేసులు, 38మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,439కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 377మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 1306మంది కోలుకోగా ప్రస్తుతం మరో 9756మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోనే 178మరణాలు… దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో దాదాపు సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 178కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 353 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2687కి చేరింది. ముంబయిలో కొవిడ్-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత పెరిగింది. పాజిటివ్ కేసులు సంఖ్య 1561కి చేరింది. వీరిలో 30మంది మృత్యువాతపడ్డారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాజస్థాన్లో కొవిడ్-19 తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 969కి చేరగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్, గుజరాత్ లలో పెరుగుతున్న మరణాలు… మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్లో మరణించే వారి సంఖ్య మధ్యప్రదేశ్, గుజరాత్ లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 730మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 50మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్ లో 650 పాజిటివ్ కేసులు నమోదుకాగా 28మంది ఈ వైరసకు బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 9, తెలంగాణలో 18మరణాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయానికి తెలంగాణలో 644 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 18మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 110మంది కోలుకోగా ప్రస్తుతం 516 మంది చికిత్స పొందుతున్నారు. కేవలం మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. హైదరాబాద్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడచిన 24గంటల్లో నగరంలో కొత్తగా 40 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ వైరస్ సోకి 9మంది మరణించగా మొత్తం 486మందికి సోకింది. వీరిలో కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కూడా వైరస్ తీవక్ర పెరిగింది. ఇప్పటివరకు కర్నూలులో 93 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.