మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగింపు
దేశం కోసం సైనికుల్లా పోరాడుతున్నందుకు ధన్యవాదాలు : మోదీ
- ఐక్యత చాటడమే అంబేద్కర్ కు నివాళి
- ప్రపంచ దేశాలు నేడు భారత్ వైపే చూస్తున్నాయి
- 20 తర్వాత షరతులతో కూడిన సడలింపు
- దేశంలో హాట్ స్పాట్ లపై ప్రత్యేక దృష్టి
- కరోనా కట్టడికి సప్తసూత్రాలు పాటించాలి
- ప్రపంచ దేశాలతో పోలిస్తే 25 శాతం తక్కువే
- అన్ని రాష్ట్రాధినేతల సూచనలతోనే లాక్ డౌన్ పొడిగింపు
- నేడు లాక్ డౌన్ పొడిగింపు పై మార్గదర్శకాలు జారీ
“నేటితో తొలిదశ లాక్ డౌన్ గడువు పూర్తయింది. ప్రజలు సైనికుల్లా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్ లో కరోనా నియంత్రణలో ఉంది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారు. మీకు దేశం వందనం చేస్తుంది. వాస్తవానికి దేశంలో ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుగుతాయి. అనేక రాష్ట్రాలలో పండగలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. పండగలు ఉన్నా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ తమను తాము నియంత్రించుకుంటున్నారు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను”
-నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లుగానే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. అయినా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని.. దేశం కోసం సైనికుల్లా పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని చాటారని కొనియాడారు. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేడ్కరకు గొప్ప నివాళి అని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాధాసీదాగా జరపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రధాని ప్రసంగంలోని కీలక అంశాలు… – దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారేవి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే. ప్రపంచ దేశాలు ఈ రోజు భారత్ వైపు చూస్తున్నాయి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో ప్రజల కష్టాల్ని ఎలా తగ్గించాలి.. తీవ్రతను కనిష్టానికి ఎలా పరిమితం చేయాలని నిరంతరం రాష్ట్రాలతో చర్చించి పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. . కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 20వరకు లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనా హాట్ స్పాట్ లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గితేనే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు చెప్పారు. లాక్ డౌనకు సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ రేపు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ను బాధ్యతగా పాటించాలని కోరారు. కరోనా పై పోరాటంలో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. సన్తపది సూత్రాలు 1. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి భౌతిక దూరం, లాక్ డౌన్, లక్ష్మణ రేఖ దాటవద్దు. 2. ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించాలి. 3. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అవసరమైన ఆహారం, వేడి నీళ్లు తీసుకోవాలి. 4. ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకొని నిరంతరం సమాచారం తెలుసుకోవాలి. 5. పేదలు, నిర్భాగ్యులు ఆకలితో అలమటించకుండా సమాజం ముందుకొచ్చి ఆదుకోవాలి. 6. పరిశ్రమలు, సంస్థల్లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసివేయవద్దు. 7. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పట్ల గౌరవంతో వ్యవహరించాలి. మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేటితో తొలిదశ లాక్ డౌన్ గడువు పూర్తయింది. ప్రజలు సైనికుల్లా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్ లో కరోనా నియంత్రణలో ఉంది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారు. మీకు దేశం వందనం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. కరోనా పై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. వాస్తవానికి దేశంలో ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుగుతాయి. అనేక రాష్ట్రాలల్లో పండగలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. పండగలు ఉన్నా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ తమను తాము నియంత్రించుకుంటున్నారు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేడు దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఓ పోరాటం జరుగుతుంది. చాలా దేశాల కంటే ముందే భారత్ లో ఏయిర్పోర్లలో విదేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ చేయడం ప్రారంభించాం. దేశంలో ఒక్క కేసు నమోదు కాక ముందే కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. దేశంలో 500కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకంటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని ఈ మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఏదేశంతోనూ పోల్చడానికి వీలులేని విపరీతమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలతో పోలిస్తే… మన దేశ పరిస్థితి బాగుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి విషయంలో ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో… ఇప్పుడు కరోనా కేసులు మనకంటే 25రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మనం కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే.. ఈ రోజు భారత్ పరిస్థితి దారుణంగా ఉండేది. భౌతిక దూరం, లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇచ్చాయి. ప్రభుత్వాలనుంచి, ప్రజల నుంచి కూడా లాక్ డౌన్ పొడిగించాలనే సలహాలు వచ్చాయి. ఈ మే రకు లాక్ డౌన్ మే 3వరకు పొడిగిస్తున్నాం. మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా… మీరందరూ దీనిని బాధ్యతగా పాటించాలి. కరోనాను కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క కొత్త కేసు వ్యాపించిన ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో ఒక్కరు చనిపోయినా అది ప్రమాదకరం. ప్రజలు మరింత కఠినంగా లాక్ డౌన్ ను పాటించాలి. అలా చేయకపోతే.. కరోనా మనకు మరింత నష్టం చేస్తుంది. వచ్చే వారంలో కరోనా పై పోరాటం కోసం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఏప్రిల్ 20 వరకు దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. దేశంలో కరోనా హాట్ స్పాట్ల సంఖ్య తగ్గితే ఏప్రిల్ 20 తరువాత కొన్ని చోట్ల మినహాయింపు ఇస్తాం. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే అన్ని మినహాయింపులు తీసేస్తాం. కాబట్టి మనమందరం కరోనా కట్టడికి జాగ్రత్తతో ఉండాలి. పేద ప్రజల కోసమే ఏప్రిల్ 20 నుంచి కొన్ని చోట్ల సడలింపులు చేస్తాం. లాక్ డౌన్ వల్ల వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో కరోనా కోసం ప్రత్యేకంగా లక్ష బెడ్లు ఏర్పాటు చేశాం. కరోనా కోసం 600 ప్రత్యేక హాస్పిటల్స్ ను ఏర్పాటు చేశాం. మీ ఇళ్లలో ఉన్న వృద్ధుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడే వారుంటే …వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోండి. మీ రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి… ఆయుష్ సంస్థ ఇచ్చే నిబంధనలు పాటించండి. ఆరోగ్య సేతు మోబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి… ఇతరులతో కూడా డౌన్లోడ్ చేయించండి. పేద ప్రజలకు ఆహారం అందేలా చూడండి. మీ దగ్గర పనిచేసే వారిపై ప్రేమ చూపండి… ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించకండి. పోలీసులు, నర్సులు, పారిశుద్య కార్మికులను గౌరవించండి. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అని పిలుపునిచ్చారు.