ఉదారత చాటుకున్న గూగుల్ సీఈఓ
కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు రూ.5 కోట్లు ప్రకటించిన సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి పై పోరాటం సహా లాక్ డౌ తో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రూ.5 కోట్లు సాయం చేశారు. విరాళాల విషయంలో కార్పొరేట్ సంస్థలకు అత్యంత విశ్వసనీయమైన ‘గివ్ ఇండియా’కు తన విరాళం అందజేశారు. గూగుల్ సీఈవో తన వంతుగా రూ.5కోట్లు ఇచ్చారని గివ్ ఇండియా ట్విటర్ లో వెల్లడించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలను ఆదుకొనేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని పేర్కొంటూ సుందర్ పిచాయ్ కు ధన్యవాదాలు చెప్పింది. కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. భారతదేశంలో కోవిడ్ – 19, లాక్ డౌన్ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు నగదు సహాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విటర్ ద్వారా సుందర్ పిచాయ్ కు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పోరులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు గూగుల్ 800 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అలాగే చిన్న వ్యాపారాలకు మూలధనాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ల డాలర్లను పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాకుండా వాస్తవాల నిర్ధారణ, తప్పుడు సమాచారం పై లాభాపేక్ష లేకుండా పోరాటం చేసేందుకు 6.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 కోట్లు) తక్షణ సాయాన్ని అందిస్తున్నట్టు కూడా గూగుల్ ప్రకటించింది. భారత్ తో పాటు ప్రపంచ మొత్తం ఈ సేవలు అందించనుంది. మహమ్మారి కరాళ నృత్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లా డౌన్లోకి వెళ్లి పోయాయి. రవాణా సహా, ఇతర వాణిజ్య సేవలన్నీ నిలిచిపోయాయి. వినిమయ డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకు పోతున్నాయి. ఉపాధి మార్గాలు లేక ముఖ్యంగా రోజువారీ కార్మికులు, పేద వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. దీంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున విరాళాల సేకరణ కూడా చేపట్టాయి. అలాంటి వాటిల్లో ఒకటి గివ్ ఇండియా అనే సంస్థ. తినడానికి తిండి లేక నానా అగచాట్లు పడుతున్న కోవిడ్-19 బాధిత కుటుంబాలను గుర్తించి, వారిని ఆదుకుంటోందీ సంస్థ. మాస్క్ లు, సబ్బులు, శానిటరీ కిట్తోపాటు ప్రధానంగా నగదు నేరుగా బాధిత కుటుంబాలకు అందేలా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ గివ్ ఇండియాకు తన తాజా విరాళాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, గివ్ ఇండియా సమాజంలో ఇప్పటివరకు రూ .12 కోట్లు సమీకరించింది. కాగా మహమ్మారి కారణంగా భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 308 కు పెరిగింది. సోమవారం 35 కొత్త మరణాలు సంభవించగా, కేసుల సంఖ్య 9,152 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.