కేసీఆర్ ఆలోచన…మోదీ ఆచరణ

లాక్ డౌన్ పొడిగింపు పై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని మోదీ

  • వారం రోజుల క్రితమే లాక్ ఔట్ పై కేసీఆర్ నిర్ణయం
  • దాదాపు ఎక్కువ శాతం రాష్ట్రాలదీ అదే మాట
  • విపక్షాల వీడియో కాన్ఫరెన్స్ లోనూ లాక్ ఔట్ కే ఓటు
  • నెలాఖరుదాకా పొడిగింపే శరణ్యం
  • నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం
  • లాక్ డౌన్
  • 2 పై వివరణ ఇవ్వనున్న మోదీ 

న్యూఢిల్లీ: విపత్కర వేళలో ముప్పు నుంచి తప్పించుకోవటానికి ఉన్న ఏకైక మార్గం ముందుచూపే. ఆ విషయంలో తనకు మించినోళ్లు లేరన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గత సోమవారం రాత్రి వేళ నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్ డౌన్ ను పొడిగించటం తప్ప మరో మార్గం లేదని తేల్చేశారు సీఎం కేసీఆర్. దేశానికి ఉన్న పరిమితులను చూస్తే.. కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. దీంతో అధికశాతం రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ పొడిగింపు తప్ప శరణ్యం లేదంటున్నాయి. అయితే నేడు ప్రధాని మరోసారి లాక్ డౌన్ పొడిగించే విషయంలో కేసీఆర్ సూచనను పాటించడమేగాక…తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టిన కరోనా కట్టడి చర్యల పైనా దృష్టి పెట్టినట్లు సమాచారం. లాక్ డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉ ద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14 (మంగళవారం)న లాక్ డౌన్ ఎత్తివేసే విషయం పై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాను చేసిన సూచనను కేంద్రంలోని మోడీ సర్కారు పరిశీలించాలన్నారు. కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో పూర్తి కానుంది. ఇందుకు మరో వారం మాత్రమే గడువు ఉన్న వేళ.. తెర మీదకు వచ్చిన కేసీఆర్ పొడిగింపు అంశాన్ని చర్చకు పెట్టారు. కేసీఆర్ వాదనకు దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం సైతం కేసీఆర్ మాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసినా.. తాత్కాలికంగా సడలించినా.. పాక్షికంగా పక్కకు పెట్టినా జరిగే నష్టం భారీగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. పొడిగింపు పై కేసీఆర్ సూచనకు తగ్గట్లే.. ప్రధాని మోడీ మాటలు ఉండటాన్ని మర్చిపోకూడదు. కరోనా పై దీర్ఘకాలిక పోరుకు సిద్ధంగా ఉండాలని.. ఓడినట్లుగా భావించకూడదన్న మాట ఆయన నోటి నుంచి రావటం అంటే.. కచ్చితం గా లాక్ డౌన్ పొడిగింపు ఖాయమని చెప్పక తప్పదు. నిత్యవసర వస్తువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. మాల్స్.. మత ప్రార్థనలు జరిగే చోట్లకు ప్రజలు వెళ్లకుండా అడ్డుకోవాలని.. ఇందులో భాగంగా మే 15 వరకు వాటిని మూసి వేయటం మంచిదన్న ఆలోచన లో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే..లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని తెర మీదకు తెచ్చేందుకు.. కేంద్రం ఏమేం చేయాలనుకుంటున్న విషయాన్ని ప్రధానమంత్రి మోడీనే స్వయంగా జాతి జనాలకు చెబుతారని.. త్వరలోనే ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెబుతున్నారు. ఈ సందర్భం లోనే లాక్ డౌన్ పొడిగింపు అంశం పై క్లారిటీ ఇవ్వటం ఖాయమంటున్నారు. అదంతా ఓకే.. మరీసారి ఎలాంటి టాస్కు ఇస్తారో చూడాలి. కాగా బుధవారం పార్లమెంటులోని ఫ్లోర్ లీడర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న క్రమంలో మార్చి 24న విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అత్యవసర స్థితిని తలపిస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను మరికొంతకాలంపాటు పొడిగించడం ద్వారానే కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయగలమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభిప్రాయానికి మద్దతు పెరుగుతున్నది. దాదాపు ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌనను పొడిగించాలని స్పష్టం చేశాయి. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ప్రకటించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం కర్ణాటక సీఎం యెడియూరప్ప మాట్లాడుతూ.. లాక్ డౌనను మరో 15 రోజులపాటు పొడిగించాలని మంత్రులు సూచించినట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పొడిగించాలని అంటున్నాయి. దేశ ప్రజలను కాపాడుకోవడానికి లాక్ డౌన్ ను పొడిగించడం కంటే మరో మార్గం లేదని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు లాక్ డౌనను పకడ్బందీగా అమలు చేయడం ద్వారానే కరోనా మూడవ దశకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల దేశంలో వైరస్ వ్యాప్తి ఇప్పటివరకూ ఆధీనంలోనే ఉన్నదని, అయితే దాన్ని పూర్తిగా అంతం చేయాలంటే ఏప్రిల్ 14 వరకు ఉన్న లాక్ డౌన్ ను మరింతకాలంపాటు పొడిగిస్తేనే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ నేతల వీడియో కాన్ఫరెన్స్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావులు కూడా లాక్ డౌన్ పొడిగిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో దాదాపు 80 శాతం మంది నేతలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరారు. దేశంలో కరోనా పరిస్థితుల పై చర్చించడానికి ప్రధాని మోదీ ఈ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎంల అభిప్రాయాలకు అనుగుణంగా లాక్ డౌన్ పొడిగింపు పై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. కాగా గురువారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక్కరోజులో 549 కేసులు నమోదయ్యాయని.. 17 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితుల పై ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం లాక్ డౌన్ పాక్షికంగా ఎత్తివేయాలా లేదా నిబంధనలు సడలించాలా అన్న విషయం పై ప్రధాని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేసి లాక్ డౌన్ పై నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న తరుణంలో కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలా అన్న విషయం పై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎయిర్ లైన్ల కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని.. భౌతిక దూరం పాటిస్తూ(సీటు వదిలి సీటు) విమానాలు నడిపే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని… విద్యాసంస్థలు, మతపరమైన ప్రార్థనాస్థలాలు యథావిధిగా మూసివేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపాయి. మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటున్న భారత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కోవిడ్-19 ను కట్టడి చేసేందుకు మలేరియా యాంటీ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాలు భారత్ సాయం కోరిన విషయం తెలిసిందే. అత్యవసర మందుల పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు అండగా నిలవాలని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు ఇప్పటికే అమెరికాకు మాత్రలు సరఫరా చేసిన భారత్.. బ్రెజిల్ కు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ క్రమంలో ఆయా దేశాధినేతలు భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 29 మిలియన్ల డోసుల డ్రగ్స్ ఎగుమతి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కరోనా పై పోరులో సహకారం అందిస్తామన్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ఇదే బాటలో నడిచారు. దాదాపు ఐదు టన్నుల మెడిసన్ ఇజ్రాయెల్ కు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు.. ” ఇజ్రాయెల్ కు క్లోరోక్విన్ పంపినందుకు నా స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఇజ్రాయెల్ పౌరులందరూ మీకు ధన్యవాదాలు చెబుతున్నారు” అని నెతన్యాహు గురువారం ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన మోదీ.. ” మహమ్మారి పై కలిసికట్టుగా పోరాడుతాం. స్నేహితులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పార్థిస్తున్నాం” అని ట్విటర్ లో పేర్కొన్నారు. కాగా కరోనా ధాటికి ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 86 మంది మృతి చెందగా… దాదాపు 10 వేల మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తమకు మాస్కులు సరఫరా చేయాలని ప్రధాని మోదీకి మార్చి 13న విజ్ఞప్తి చేసిన నెతన్యాహు.. ఏప్రిల్ 3న క్లోరోక్విన్ సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రధాని మోదీ ఇందుకు సానుకూలంగా స్పందించి ఇజ్రాయెల్ కు అండగా నిలిచారు.