కలిసిరాకుంటే నీకే నష్టం

ట్రంప్ విమర్శలకు టెడీస్ జవాబు

జెనీవా: కరోనా వైరస్ ను రాజకీయం చేయవద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్డీస్ అథనోమ్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపట్ల పక్షపాత వైఖరి చూపుతోందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల పై అథనోమ్ స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు జాతి, మత, కుల, వర్ణభేదాలు లేవని స్పష్టం చేశారు. అసలు క్వారంటైన్ కు పంపాల్సింది కొవిడ్-19ని అని ప్రపంచ దేశాలు గుర్తించాలని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని ఎదర్కోవడానికి అందరూ కలిసికట్టు పోరాడటం ఒక్కటే పరిష్కార మార్గమని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పై విమర్శలను గుప్పించిన ట్రంప్.. ఆ సంస్థకు నిధుల పంపిణీని నిలిపివేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై టెడ్స్ స్పందిస్తూ “మేము ప్రతి ఒక్క దేశానికీ అత్మీయులమే. కరోనా నేపథ్యంలో ప్రపంచానికి నేను రెండు విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను. ఒకటి జాతీయ సమైక్యత పాటించడం, రెండవది ప్రపంచ సంఘీభావం. ఈ వైరస్ ను రాజకీయం చేయటానికి బదులు నేతలు జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల కోసం కృషిచేయాలి” అని దేశాధినేతలను కోరారు. కలిసి నడవకుంటే ఎంత గొప్ప దేశమైనా కష్టాల్లో పడాల్సిందేనని ఆయన పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. చైనా, అమెరికా, జి-20 దేశాలే కాకుండా ప్రపంచమంతా కరోనా వ్యతిరేక పోరాటంలో ఐక్యమవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ విభేదాల వల్ల కరోనాకు మరింత బలం చేకూరుతుందని ఆయన వివరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రాస్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాసటగా నిలిచారు. కొవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రపంచం యుద్ధం చేస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో, మనం గెలవాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహాయం చేయాల్సిందేనంటూ గుటెర్రాస్ స్పష్టం చేశారు.