డబుల్ సెంచరీకి చేరువలో కరోనా మరణాలు
భారత్ లో 6 వేలు దాటిన పాజిటివ్ కేసులు…
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసుల సంఖ్య 6 వేలు దాటింది. మొత్తం 6098కి కరోనా సోకింది. 184 మంది చనిపోయారు. 479 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 163 మందికి కరోనా సోకగా ఒక్క ముంబైలోనే 143 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకూ 72 మంది చనిపోయారు. అటు మధ్యప్రదేశ్ లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. కరోనాతో డాక్టర్ చనిపోయారు. దీంతో మధ్యప్రదేశ్ లో మరణాల సంఖ్య 22కు పెరిగింది. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల నుంచి 30శాతం కోత విధించే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఏడాది పాటు వేతనాల్లో కోత నిర్ణయం అమలులో ఉంటుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంపీల వేతనాల్లో 30శాతం కోత విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. మధప్రదేశ్ లో డాక్టర్ దంపతులు సహా ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హెూసంగాబాద్ లోని ఇటర్షి ప్రాంతంలో డాక్టర్ కు , ఆయన భార్యకు మరో నలుగురికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరిని హెూం క్వారంటైన్ లో ఉంచాం. వారు ఎవరెవరిని కలిశారో..ఎవరెవరితో టచ్ లో ఉన్నారో వారందరి వివరాలు సేకరించి..వారిని కూడా క్వారంటైన్ కు తరలిస్తామని మాసంగాబాద్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ జైశని తెలిపారు.