చెడ్డ పేరు తెస్తున్నారు

వనపర్తి పోలీసులపై మంత్రి కేటీఆర్ సీరియస్

వనపర్తి: వనపర్తిలో ఓ వ్యక్తి పై పోలీసులు వ్యవహరించిన తీరు పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసులు కింద పడేసి చితకబాదారు. దీనికి సబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులు అలా ప్రవర్తించడం సరి కాదన్నారు. ఘటన పై విచారణ జరిపించాల్సిందిగా హెం మంత్రి మహమూద్ అలీ, డీజీపీని కోరారు. కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో నిత్యం ఎంతో కష్టపడి సమర్థంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులందరికీ చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటన పై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు స్పందించారు. దీనికి సంబంధించి పోలీసుల తీరు పై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బంది పై దాడి, నిజామాబాద్ లో అధికారుల అడ్డగింత ఘటనల పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వారి పై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తులు కేవలం మూరు?లే కాదు! వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్ రూమ్ లో జారిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ల పై, సెక్యూరిటీ సిబ్బంది పై దాడికి దిగారు. ఐసోలేషన్ వార్డులోని కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.