మసీదులో దాక్కున్న జమాత్ సభ్యులు
లక్నో పోలీసులకు పట్టించిన భారత సైనికులు
లక్నో :మసీదులో దాక్కున్న 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను సైనికులే పోలీసులకు పట్టించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కంటోన్మెంటులో వెలుగుచూసింది. లక్నోలోని ఆర్మీ కంటోన్మెంటులోని సదర్ బజార్ అలీజాన్ మసీదులో కరోనా వైరస్ లక్షణాలతో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు దాక్కున్నారని లక్నో మిలటరీ ఇంటలిజెన్స్ కు సమాచారం వచ్చింది. అలీజాన్ మసీదుకు సీలు చేసిన ఆహార ప్యాకెట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పంపిస్తున్నట్లు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. మిలటరీ అధికారులు వెంటనే లక్నో పోలీసు కమిషనరుకు సమాచారం అందించి వారితో కలిసి మసీదు పై దాడి చేయగా, లోపల సహారాన్ పూర్ నగరానికి చెందిన 12 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు దాక్కున్నారని మిలటరీ, పోలీసులు గుర్తించారు. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొని కరోనా లక్షణాలున్నా వారు మసీదులో దాక్కున్నారని దర్యాప్తులో తేలింది. దీంతో వారి నమూనాలను సేకరించి పరీక్షకు పంపించి వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 12 మంది తల్లీగ్ జమాత్ సభ్యులు, మరో ఇద్దరు సహచరులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269, 270,271 ల కింద కేసు నమోదు చేశారు. మసీదులో ఉన్న వారిలో 8 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మసీదు పక్కనే ఉన్న జారా క్లినిక్ డాక్టర్ ఆసిఫ్ ఖాన్ తబ్లిగ్ జమాత్ సభ్యులకు చికిత్స అందించారని తేలడంతో డాక్టరును కూడా పట్టుకున్నారు. అనంతరం మసీదును శానిటైజ్ చేయించారు. అజ్ఞాతంలో ఉన్న జమాతీలకు సౌకర్యాలు కల్పించినందుకు డాక్టరు పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.మసీదులోని జమాత్ సభ్యులు చుట్టుపక్కల సదర్ బజార్ లో పండ్లు, కూరగాయలు కొన్నారని తేలడంతో వైద్యాధికారులు వారిని కూడా పరీక్షిస్తున్నారు. మసీదులో దాక్కున్న జబీర్ హసన్ (49), అఫాబ్ (71), తన్వీర్ ఆలం (32), కుర్బన్ (50), అఫ్టల్, ఫర్మాన్ (30), నాసిమ్ (54), ఇంటెజార్ (46), రఫీక్, డానిష్, కుర్బన్, ఇర్ఫాన్ (71), అథర్, మీరాజుద్దీన్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిలటరీ, పోలీసు అధికారులు మసీదులో దాక్కున్న కరోనా రోగులను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.