లాక్ డౌన్ పొడిగించండి : కేసీఆర్

  • మరో మార్గం లేదని ప్రధానికి చెప్పాను 
  • తెలంగాణకు తగ్గిన ఆదాయం 
  • రూ.2400 కోట్లకు ఆరు కోట్ల ఆదాయమే
  • బతికి ఉంటే బలుసాకు తిని బతుకొచ్చు
  • వైద్య సిబ్బందికి సీఎం నగదు బహుమతులు
  • పారిశుధ్య కార్మికులకు పారితోషికాలు 
  • సమయంలో రాజకీయాలు వద్దు
  • మానవత్వంతో మీడియా సహకరించాలి
  • ప్రగతి భవన్లో మీడియా సమావేశంలో కేసీఆర్

హైదరాబాద్,జ్యోతిన్యూస్ : ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని,లాక్ డౌన్ ఎత్తివేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నానని, పరిస్థితిని అధిగమించేందుకు తీవ్రంగా చర్చిస్తున్నామని, మోదీ గారు అడిగితే లాక్ డౌనను కొనసాగించాల్సిందేనని చెప్పానని తెలిపారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చని, ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా పునరుద్ధరించుకోవచ్చని, ప్రాణాల్ని తిరిగి తేలేం కదా అని ప్రశ్నించారు. యుద్ధం మిగిల్చే విషాదం చాలా భయంకరంగా ఉంటుందని, అంతులేనిదిగా ఉంటుందని, ఆ విషాదాన్ని దేశం, నాగరిక సమాజం భరించజాలదని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విషయంలో ఏప్రిల్ లోని ఈ ఆరు రోజుల్లో రూ.2,400 కోట్ల ఆదాయానికి రూ.6కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. ఢిల్లీ వెళ్లోచ్చిన 172 మంది ద్వారా 93 మందికి కరోనా సోకిందని, కరోనా వల్ల ఆదాయం తగ్గినా మరణాల్లేవని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు 364 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 మంది డిశ్చార్జి అయ్యారనీ, మరో 15 మంది బుధవారం డిశ్చార్జీ కానున్నారని తెలిపారు. కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదని,లాక్ డౌనను మరింత పకడ్బందీగా అమలుచేస్తామని వెల్లడించారు. కరోనా పై యుద్ధంలో అందరికీ మించి తమ ప్రాణాలకు తెగించి, తమ వ్యక్తిగత వ్యవహారాలను పక్కనబెట్టి వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసిన వారినుంచి డైరెక్టర్ వరకు రాష్ట్ర ప్రజల తరఫున రెండు చేతులెత్తి దండం పెడుతున్నాని, వారికి పాదాభివందనం చేస్తున్నానని,వారి ధైర్యం గొప్పదని, వాళ్లు చాలా గొప్పవాళ్లని, అనేక రూపాల్లో పనిచేస్తున్నారని, వాళ్లను ఎంత పొగిడినా, దండం పెట్టినా తక్కువేనన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి స్థాయి వేతనంతో పాటు అదనంగా పారితోషికాలను అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారని, పారిశుద్ధ్య కార్మికుల జీతంలో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. సీఎం ప్రోత్సాహం కింద మున్సిపల్ మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తామని, . జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు రూ. 7,500 ఇస్తామని,. డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలు పెంచి ఇస్తామని తెలిపారు. పారిశుద్ధ్య పనులు బాగా కొనసాగిస్తే జబ్బు వ్యాప్తిని నియంత్రించొచ్చని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి పూర్తి వేతనం ఇవ్వాలని చెప్పామని,వారి సేవలను గుర్తించి తాజాగా సీఎం బహుమతి కింద వాళ్లందరికీ 10శాతం గ్రాస్ శాలరీ ఇస్తున్నామని తెలిపారు. వాళ్లకు వెంటనే డబ్బులు అందజేస్తామని, ఈ విషయంలో ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడామని,ఆ నిధులను తక్షణం వాళ్లకు అందజేస్తామని వివరించారు. ఇలాంటి సమయంలో కొన్ని పత్రికలు దుర్మార్గంగా రాస్తున్నాయని, రాష్ట్రంలో మందుల కొరత లేదని, దాదాపు 40వేల పీపీఈ కిట్లు ఉన్నాయని, మరో 5లక్షల కిట్లకు ఆర్డర్ చేశామని వివరించారు. అనుచితంగా వ్యవహరిస్తే సరైన సమయంలో సరైన శిక్ష వేస్తామని, దుర్మార్గులను వదిలి పెట్టేది లేదని,సంక్షోభ, క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారని, తాను మీడియాకు వ్యతిరేకం కాదని, రాజకీయాలకు బోలెడంత సమయం ఉందని, అసత్యాలు ప్రచారం చేసేవారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.