రెండోసారీ నెగెటివే..

ట్రంపకు వైద్యపరీక్షల నిర్వహణలో కరోనాపై వచ్చిన రిజల్ట్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ పి కానీ వెల్లడించారు. 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అమెరికా అధ్యక్షుడికి కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు చాలా త్వరగా, కచ్చితంగా వచ్చాయని చెప్పారు. మ రోవైపు అమెరికాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో మరో నాలుగు వారాల పాటు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ట్రంప్ సూచించారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించడం ఎంతో ముఖ్యమని, తద్వారా దేశంలో ఎంతో మంది జీవితాలను కాపాడినవారమౌతామని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులతో కలిసి అమెరికా పనిచేస్తోందన్నారు. కరోనాపై గెలిచేందుకు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నామని, బాధితులకు చికిత్స, వైద్యం, వ్యాక్సిన్ తయారీలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని ట్రంప్ తెలిపారు. రోజుకు లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కచ్చితమైన ఫలితాలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కరోనా బాధితులు నమోదు కాగా 50 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇక అమెరికాలో గురువారం వరకు 2,35,000 మంది వైరస్ బారిన పడగా, 5800 మంది మరణించారని శ్వేతసౌధం ప్రకటించింది.