కరోనా విశ్వరూపం..
10లక్షలు దాటిన కేసులు
న్యూయార్క్: కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో అమెరికా, యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో రోజు రోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క ఐరోపాలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 10లక్షలు దాటింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 53వేలు దాటింది. కరోనా మరణాల్లో సగానికిపైగా ఇటలీ..స్పెయిన్ దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి 210,000 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే అమెరికాలో వెయ్యి మంది బలయ్యారు. కరోనా కారణంగా కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్పెయిన్లో మళ్లీ మృతుల సంఖ్య పెరిగింది. కరోనా వైరస్ వల్ల ఆ దేశంలో గత 24 గంటల్లో 932 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 10,935కు చేరుకున్నది. ఇటలీ తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాల సంభవించిన దేశంగా స్పెయిన్ నిలిచింది. శు క్రవారం నాడు ఆ దేశంలో పాజిటివ్ తేలిన కేసుల సంఖ్య లక్షా 17 వేలు దాటింది. లాంబార్లీ లాంటి ప్రాంతాల్లో ఉన్న హాస్పటళ్లు తీవ్ర వత్తిడికి లోనవుతున్నాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఇప్పటికే పేషెంట్లతో నిండిపోయాయి. తాజా ఆ ప్రాంతంలో 1300 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు పది వేల మంది వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. కరోనా వైరస్ కరాళనాట్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో నమాజ్ చేసేందుకు మసీదులకు రావద్దు అనే నిబంధనను అమలు చేయలేక పాకిస్థాన్ సతమతమవుతున్నది. మసీదులోకి ఐదుగురికి మించి రావద్దని నామమాత్రంగా నిబంధన ఉన్నప్పటికీ దానిని పాటించేవారే కరువయ్యారు. దాంతో శుక్రవారం పాకిస్థాన్ కరోనా కేసుల సంఖ్య 2,400 దాటింది. ఇప్పటివరకు 35 మందికి పైగా మరణించారు. 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసుల్లో పంజాబ్ 920 కేసులతో అగ్రస్థానంలో నిలువగా 783 కేసులతో సింధ్ రెండో స్థానంలో నిలిచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అతితక్కువగా 9 కేసులు నమోదయ్యాయి. ఓ వారం రోజుల పాటు పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేశారు. కానీ ప్రజలను మసీదులకు రావద్దని, ఇళ్లకే పరిమితం కావాలని ఒప్పించడం అధికారులకు చాలా కష్టమైపోతున్నది. సింధ్ లో శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటలవరకు లాక్ డౌన్ విధించారు. శుక్రవారం ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో జనం హాజరు కాకుండా నిలువరించేందుకే ఇలా చేశారు. మతపరమైన సంస్థలు కూడా ఇంటి దగ్గరే ప్రార్థనలు చేయొచ్చని ఫత్వాలు జారీచేశాయి. అయినా జనం మసీదులకు వస్తూనే ఉండడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా నయమైన కరోనా రోగుల ప్లాస్మాతో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు పాకిస్థాన్ వైద్యులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. చైనా కూడా ఈ ప్రక్రియను ప్రభావయుతంగా వినియోగించిందని పాక్ వైద్య నిపుణుడు తాహిర్ షంసీ తెలిపారు. ప్పంచబ్యాంకు కరోనా ఉపశమన ప్యాకేజీలో భాగంగా పాకిస్థాన్‌కు 20 కోట్ల డాలర్ల సహాయాన్ని ప్రకటించిందని పాకిస్థాన్ రేడియో తెలిపింది. జర్మనీలో కరోనా కేసులు, మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో దేశంలో కేసుల సంఖ్య 79,696కు చేరింది. గురువారం ఇది 6174గా ఉన్నది. అదేవిధంగా 140గా కరోనా మృతుల సంఖ్య 1,017కు పెరిగింది. కొత్తగా బావరియాలో 20,237, నార్త్ రైన్ వెస్ట్ఫ లియాలో 16,606, బాడెన్ వట్టెంబర్గ్ లో 16059, బెర్లిలో 3202 కేసులు నమోదవడంతో మొత్తం కరోనా పాజిటివ్ ల సంఖ్య 79,696కు చేరింది. దీంతో ఐరోపాలో ఇటలీ (1,15,242), స్పెయిన్ (1,12,065) తర్వాత అత్యధిక కరోనా కేసులు రికార్డయిన దేశంగా జర్మనీ నిలిచింది. మొత్తంగా ఐరోపాలో 5,03066 కేసులు నమోదవగా, 33వేల మంది మరణించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికంటే ఎక్కువ.