వారిని వెంటనే పంపేయండి
మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల పై కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. వారిని తనిఖీ చేసి వీలైనంత త్వరగా వారిని దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించింది. వీరిలో ఎవరికైనా కొవిడ్-19 ప్రభావం ఉంటే చికిత్స అందజేయాలని సూచించింది. మిగిలిన వారిని అందుబాటులో ఉన్న విమానానికి పంపించాలని ఆదేశించింది. విమానం లేని పక్షంలో వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించాలని తెలిపింది. వారిని తీసుకొచ్చిన సంస్థలే ఖర్చులు భరించేలా చూడాలని ఘోంశాఖ స్పష్టం చేసింది. జమాత్ కు వచ్చిన విదేశీ బృందాలు ప్రస్తుతం భారత్ లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయని.. వారు వైరస్ ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తల్లిగి జమాత్ సమావేశంలో పాల్గొన్న చాలా మందిలో కరోనా పాజిటివ్ గా తేలిందని.. అందుకే వీరందరికీ స్క్రీనింగ్ తక్షణావసరం అని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సమాచారం ప్రకారం.. భారత్ కు వచ్చిన దాదాపు 2,000మంది విదేశీయులు దేశంలో సంచరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వారు ఆరు నెలల వరకు దేశంలో ఉ ండేందుకు అనుమతులు ఉన్నాయని రాష్ట్రాలకు పంపిన లేఖలో పేర్కొంది. దిల్లీలోని నిజాముద్దీన్‌లో తల్లిగి జమాత్ కు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. వేల మంది దీనికి హాజరైనట్లు తేలడం.. వీరంతా వివిధ ప్రాంతాలకు వెళ్లడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మంది గుర్తించి పరీక్షలు నిర్వహించాయి. పాజిటివ్ గా తేలిన వారికి చికిత్స అందజేస్తున్నారు. మిగిలిన వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు. మిగిలిన వారి జాడ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.