ఉల్లం..ఘనుల కోసం తాత్కాలిక జైళ్లు!

సత్ఫలితాలిస్తున్న లుథియానా పోలీసుల కార్యాచరణ

లుథియానా (పంజాబ్): దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర పనులు లేకున్నా వాహనాలతో రోడ్ల పైకి వస్తున్నారు. ఇలా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికోసం తాత్కాలిక జైళ్లను ఏర్పాటుచేశారు లుథియానా అధికారులు. ఇలా 6వేల మందికి సరిపోయే నాలుగు ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేశామని లుథియానా పోలీస్ కమిషనర్ రాకేష్ అగర్వాల్ వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే నిబంధలను ఉల్లంఘించిన 200మందిని ఈ జైళ్లకు తరలించామని పేర్కొన్నారు. 5వేల వాహనాల సీజ్.. కరోనా తీవ్రతను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ సత్ఫలితాలిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు లాక్ డౌన్ ఉ ల్లంఘనలకు పాల్పడుతూ వాహనాలతో రోడ్లమీదకు వస్తున్నారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తూ కేసులు నమోదుచేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో 5వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. వీటిలో అత్యధికంగా 5106 బైకులు, 183 మూడుచక్రాల వాహనాలు, 263 కార్లను సీజ్ చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లో తొలి మరణం… కరోనా వైరతో ఉత్తర్ ప్రదేశ్ లో తొలి మరణం సంభవించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 101కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ సందర్భంలో లఖ్నవూకి చెందిన 18మంది దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్నట్లు గుర్తించారు. అయితే వీరు అక్కడినుంచి లక్ నవూకి తిరిగిరాలేదని అధికారులు పేర్కొన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న మరో 24మంది విదేశీయులు మాత్రం లఖ్ నవూ చేరుకున్నారు. వీరికి స్థానిక బలరాంపూర్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని లఖ నవూ పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే తెలిపారు. మధ్యప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా తీవ్రత.. మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత అధికమౌతోంది. తాజాగా ఇండోర్ లో ఒకే రోజు 19కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 63కు చేరిందని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులు ఇదివరకే వైరస్ సోకిన వారి నుంచి సంక్రమించినట్లు గుర్తించామన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ఇండోర్‌లో దాదాపు 600మంది కరోనా అనుమానితులను క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు.