భారత్ లో కరోనా విజృంభణ

భయపెడుతున్న కేసుల సంఖ్య..32కు చేరుకున్న మృతులు 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ బాధితుల సంఖ్య 1251కి చేరగా.. మృతుల సంఖ్య 32గా నమోదైంది. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో నిన్న నమోదైన మృతుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 8కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో 225కేసులు నమోదుకాగా 25మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్ లో కొవిడ్-19 మృతుల సంఖ్య 6కు చేరింది. మధ్యప్రదేశ్ లో వైరస్ తీవ్రత పెరిగింది. తాజాగా ఇక్కడ మరణాల సంఖ్య ఐదుకు చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక, పశ్చిమబెంగాల్ లో ముగ్గురు చొప్పున మరణించారు. దిల్లీలో కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. సోమవారం ఒకే రోజు ఇక్కడ 25కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 100కు చేరగా ఇద్దరు మరణించారు. జమ్మూ కశ్మీర్ లో కొవిడ్ 19 కారణంగా ఇద్దరు మరణించారు. కేరళలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ 220కి పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. ఈ వైరస్ సోకిన 68ఏళ్ల వృద్ధుడు మంగళవారం మరణించాడని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. బిహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడులో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్ గఢ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మార్చి 18వ తేదీన లండన్ నుంచి రాయ్ పూర్‌కు చేరుకున్న 22ఏళ్ల యువకునికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో పెరుగుతున్న తీవ్రత.. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఆరుగురు తెలంగాణవాసులు మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతిఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఇప్పటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరగా.. మృతుల సంఖ్య 6గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బాధితుల సంఖ్య 40కి చేరింది. రెండో దశలోనే కరోనా… అయితే కరోనా వైరస్ తీవ్రత అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో తక్కువగానే ఉన్నట్లు కేంద్రప్రభుత్వం అభిప్రాయపడింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇది స్థానిక సంక్రమణ(లోకల్ ట్రాన్స్ మిషన్) దశలోనే ఉన్నట్లు ప్రకటించింది. ఇంకా సమూహిక సంక్రమణ(కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) దశకు చేరలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం దేశంలో పరిమిత సామూహిక సంక్రమణ(లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్సోమిషన్) దశకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొనడం విశేషం. ఐసోలేషన్లో ఉన్న వ్యక్తి ఆత్మహత్య.. ఛత్తీస్ గఢ్ లోని తాగాపానికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి తమిళనాడు నుంచి తన స్వస్థలం చేరుకున్నాడు. అయితే అతన్ని వైద్యశాఖ అధికారులు హెం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. ఐసోలేషన్ ఉన్న ఆ వ్యక్తి తాజాగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతనికి కరోనా లక్షణాలు కూడా లేవని అధికారులు నిర్ధారించారు. మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. సంవత్సరం క్రితమే తన భార్య, కొడుకు చనిపోయినట్లు గుర్తించారు అధికారులు.