వేర్వేరుగా ఉరితీయలేము
నిర్భయకేసులో కేంద్ర పిటిషన్ కొట్టివేసిన సుప్రీం
న్యూఢిల్లీ: 2012 నిర్భయ హత్యాచార దోషుల ఉరి అమలుపై స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను న్యూఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. స్టే యథాతథంగా కొనసాగుతుందని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయలేమని న్యాయస్థానం పేర్కొంది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులు వినియోగించుకునేందుకు కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది. వారం రోజుల గడువు ముగిసిన తర్వాత వారి ఉరికి సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమవుతోందని న్యాయస్థానం వెల్లడించింది. ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరి తీయాల్సిందిగా ఇటీవల దిల్లీ పటియాలా హౌస్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. కానీ ఉరి అమలుపై స్టే విధించాల్సిందిగా కోరుతూ నలుగురు దోషులు మరణశిక్షకు రెండు రోజుల ముందు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీంతో రెండోసారి ఉరి అమలు వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి అమలును వాయిదా వేస్తున్నట్లు దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు శని, ఆదివారాలు విచారణ చేసి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కేంద్రం వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ..ఉరి అమలుపై స్టే కొనసాగుతోందంటూ పేర్కొంది. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ రాష్ట్రపతికి ఈనెల 1న క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది. ఇక మరో దోషి ముకేశ్‌కుమార్‌కు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు మూసుకుపోయాయి. అతడు పెట్టుకున్న క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై రివ్యూ పిటిషన్ వేయగా దాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.