నిజామాబాద్‌కు తీపి కబురు

సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌:
తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం అక్కడున్న డివిజినల్‌ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచనున్నట్లు గోయల్‌ వెల్లడించారు. ఐఏఎస్‌ హోదా డైరెక్టర్‌ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పసుపు, మిరప పంటను ద ష్టిలో పెట్టుకొనే నిజామాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పీయూష్‌ గోయల్‌ వివరించారు.
నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ స్పైస్‌ బోర్డు డివిజన్‌ కార్యాలయాన్ని రీజనల్‌ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్‌లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. డైరెక్టర్‌ స్థాయి అధికారి ఆ కార్యాలయాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. తక్షణమే బోర్డు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మిర్చి, పసుపు, సుగంధ ద్రవ్యాల అమ్మకాలు, కొనుగోలుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్‌ తెలిపారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. పసుపు నాణ్యత, దిగుబడి పెంచే విషయంపై బోర్డు పనిచేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు సహకరిస్తుందని రైతులకు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్‌ రైతుల కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను తాము కల్పించామని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.
బోర్డుల వైఫల్యానికి అనేక కారణాలు:ఎంపీ అరవింద్‌
కేంద్రం తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ప్రకటించిన సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ప్రకటన సంక్రాంతి పండగ రోజునే ప్రకటించాల్సిందని.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆలస్యం అయిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పసుపు రైతుల దీర్ఘకాలిక స్వప్నంకంటే కేంద్రం ఎక్కువే ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పసుపు రైతులకు నా అభినందనలు. బోర్డులు విఫలమవ్వడానికి అనేక కారణాలున్నాయి. బోర్డులకు శాఖలతో సమన్వయం చేసుకునే అవకాశం లేదు. పసుపు అమ్మకం, కొనుగోలుదారులతో త్వరలోనే సమావేశం నిర్వహించాలి. పసుపు అనేది ప్రాంతీయంగా పండే పంట. ప్రాంతీయ ప్రభుత్వం ప్రపోసల్‌ పంపితే ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఎంపీ అర్వింద్‌ తెలిపారు.