స్వచ్ఛమైన తాగునీరు
ఆమ్ ఆద్మీ మేనిఫెస్టో విడుదల
దిల్లీ: మరో నాలుగు రోజుల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ ప్రచారపర్వం మరింత వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిస్తున్నారు. ఈ నెల 8న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ భాజపాకు సవాల్ విసిరారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో దిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారనీ..నేటి మధ్యాహ్నం 1గంట లోగా అభ్యర్థి పేరును ప్రకటించాలని సవాల్ విసిరారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థితో చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. భాజపా ఒకవేళ ఆ పనిచేయకపోతే తన తదుపరి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో రేపు మీడియా ముందుకు వచ్చి చెబుతానన్నారు.
మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం డిప్యూటీ సీఎం సిసోడియా మాట్లాడుతూ.. ప్రతి సామాన్యుడు సంతోషంగా, గౌరవంగా జీవించేలా చూడటమే తమ పార్టీ లక్ష్యమన్నారు. నాణ్యమైన విద్య అందించేలా దష్టి పెట్టినట్టు చెప్పారు. 24గంటల విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే పైలట్ ప్రాజెక్టు కింద 24గంటల పాటు మార్కెట్లను తెరిచే ఉంచనున్నట్టు చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకొచ్చేందుకు కషిచేస్తామన్నారు. మహిళలు, యువకులు, సామాన్య ప్రజల సాధికారతే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రాయ్, సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలివీ..
– దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం
– ప్రతి ఇంటి ముంగిటకు రేషన్ బియ్యం పంపిణీ
– 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రలు
– 24గంటల విద్యుత్
– విధుల్లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే రూ.కోటి పరిహారం