మగాళ్లు..మృగాళ్లు
మారువేషంలో మారీచుడు మాయలేడిగా వచ్చాడు.. ఆ ‘బంగరు జింక’పై సీత మనసు పడింది. దానిని వేటాడుతూ.. వెంటాడుతూ శ్రీరాముడు పరుగెత్తాడు. మరో వేషంలో మైరావణుడు పర్ణశాల ముందు నిలబడి ‘భిÛక్షాందేహీ..!’ అన్నాడు. సీత శంకించింది.. అయినా సాధు స్వభావంతో ఆమె ‘లక్ష్మణరేఖ’ దాటింది. అతని అసలు రూపం బయటపడింది. సీత లక్ష్మణరేఖ దాటాక గాని రావణబ్రహ్మ నిజస్వరూపం బయటపడలేదు. రావణుడు త్రేతాయుగం నాటి కిడ్నాపర్, రేపిస్ట్. సీతను ఎత్తుకెళ్లాడు. ఆమెను ఎన్నో విధాల భ్రమ పెట్టాడు. ఆమె జంకలేదు. రావణుడి ప్రలోభాలకు భయపడి లొంగలేదు. ఇష్టం లేని స్త్రిని తాకితే రావణుడి తల వేయి ముక్కలవుతుందని శాపం పెట్టాడు బ్రహ్మ. అందువల్ల అనేక మాయోపాయాలు రావణుడు ప్రయోగించినా ఆమె ధైర్యం కోల్పోలేదు. చివరకు రాముడు కపి సైన్యంతో వచ్చి రావణవధ చేశాడు. ‘మ గాళ్లు’ మాయాపాయాలు చేస్తారని, స్త్రిలు లక్ష్మణరేఖ దాటవద్దని, ధైర్యం కోల్పోవద్దని, రేపిస్ట్‌లకు, హంతకులకు మ త్యుదండన సరైందని ఈ కథ తెలుపుతుంది. ఇపుడు ‘దిశ’ అత్యాచార మరణం దేశ వ్యాప్త సంచలనం అయ్యింది. ఇష్టం లేని అమాయకపు నిర్బలను ఆ నరరూప రాక్షసులు వంచించి హత్య చేశారు. వత్తి రీత్యా పశువుల స్వభావాన్ని గుర్తించిన ఆ వైద్యురాలు ‘నాలుగు కాళ్ల మగం’ ఆ నలుగురిలో ఉందని గుర్తించలేకపోయింది.
2012లో నిర్భయ హత్య జరిగింది. 2017లో షబ్నం, దక్షిణ ముంబయికి చెందిన నైనా, 2014లో యూపీలో దివ్య.. ఒకప్పుడు ప్రత్యూష.. ఆ తర్వాత ఆయేషా మీరా.. ఇపుడు దిశ.. ఇలా ఎందరో..! విచిత్రం ఏమిటంటే ఇటీవలి కాలంలో లైంగిక దాడులతో పాటు ప్రేమోన్మాద దాడులూ ఎక్కువయ్యాయి! మనసుపడిన అమ్మాయి ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు, నమ్మించి తీసుకెళ్లి చంపేయడం.. ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఇవన్నీ జరిగేందుకు ‘వ్యవస్థకు చిత్తశుద్ధి’ లేకపోవడమే ప్రధాన కారణం. 2017లో ఓ మహిళను ఎనిమిదిమంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలితో పాటు 14 ఏళ్ల ఆమె కొడుకునూ వేధిస్తే 2017 నవంబర్ 14న నిందితులపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు తనకుగల రాజకీయ పలుకుబడితో కేసును వాపస్ తీసుకోవాలని పోలీసులతోనే వేధింపులకు గురిచేస్తే ఆమె ఆ ప్రాంతం వదిలిపోయింది. ‘నేరానికన్నా ఎక్కువగా పోలీసులు మా జీవితాన్ని నరకప్రాయం చేశారు’ అని బాధితురాలు మీడియా ముందు గొల్లుమంది. స్త్రిని మాత మూర్తిగా, అపరకాళిగా భావించే మనం బొమ్మగా మార్చి సర్ఫ్‌లకు, సబ్బులకూ, లోదుస్తుల అ మ్మకానికి అడ్వర్టయిజ్‌మెంట్‌గా ఉపయోగించడం మొ దలుపెట్టాక ఆమెలోని ‘అవతారతత్వం’ ఎప్పుడో చంపేశాం.
ఆడపిల్ల వద్దు అనే భావనతో ఇప్పటికే వెయ్యిమంది పురుషులకు 950 మంది స్త్రిలు కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పటికే చాలా కులాల్లో విపరీతంగా అమ్మాయిల కొరత వుంది. మగపిల్లలకు పెళ్లిళ్లు అవ్వడం ఎంత కష్టంగా వుందో మ్యాట్రిమోనీల ప్రొఫైల్స్‌పై అధ్యయనం చేస్తే అర్థం అవుతుంది. ‘పురుష’ శబ్దానికి అర్థం తెలియని అజ్ఞానులు ‘ఉద్యోగం పురుష లక్షణం’ అంటే పురుషులు మాత్రమే ఉద్యోగం చేయాలని నిర్దేశిస్తున్నారు. మగపిల్లలు పుట్టడం వంశం నిలబెట్టడం అంటూ ఇంకొందరు ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఈ దేశంలో ఎంతమంది మగపిల్లలు తమ తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారనే విషయమై సమగ్ర అధ్యయనం చేయాలి. ఇటీవల రెచ్చగొట్టే దుస్తులు ఆడపిల్లలు వేసుకొంటున్నారని అందరం తెగ బాధపడిపోతున్నాం. మగవాళ్లకు మాత్రం అలాటి దుస్తులు వేసుకొనే అధికారం ఎవడిచ్చాడు? అశ్లీలత లేని డ్రెస్సులు ఎవరైనా వేసుకోవచ్చు. గాంధీ, గద్దర్, సల్మాన్‌ఖాన్, పురోహితులు.. ధరించే డ్రెస్సులలో సెన్సార్ లేదు కదా? అసలు ప్రతి సమస్యకు పైపైన జరిగే అధ్యయనం ఇలాగే వుంటుంది. దాని మూలాలు వెతకడం లేదు! ఇక్కడి నుండే సమస్య మొదలవుతుంది.
రాఖీ, టెంపర్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ మహిళల గురించి చెప్పే డైలాగులు బాగుంటాయి. కానీ ‘దిశ అత్యాచారం’ జరిగినపుడు ఆయన బయటకు రాడు. మైండ్ బ్లాక్ చేసే నటుడు మహేశ్‌బాబు, బాహుబలి సెట్టింగులతో కోట్లు సంపాదించిన రాజవౌళి, ప్రజలు ‘మారాజు నీవే’ అంటూ పాటలు పాడితే కొండలు దూకేసిన ప్రభాస్, సెక్స్ సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ, ఆయనను గంటల తరబడి కులపిచ్చి సినిమాలపై ఇంటర్వ్యూలు చేసే యాంకర్లు, ఆడవాళ్ల శక్తిని ‘పట్టుకుంటే పట్టుచీర’తో ధ్వంసం చేస్తున్న మహిళా యాంకర్లు, జీడిబంక సీరియళ్లు తీసే నటులు, దర్శక నిర్మాతలు, ‘ఇరుక్కుపో.. కొరుక్కుపో’ అంటూ పాటలు రాసే మహారచయితలు.. ఇపుడెవరూ కాలు కదిపి బయటకు రారు. ఈ సమాజంలో అసలు దోషులు వాళ్లు!? హద్దులు లేని సాంకేతిక పరిజ్ఞానం అందించిన మన అపర కుబేర వ్యా పారస్థులు ఏం తక్కువ తినలేదు. అంబానీ, సుందర్ పిచ్చయ్.. వివిధ టీవీ చా నళ్లు.. ఇలా అందరూ ఈ పాపంలో భాగస్తులే. 2017 లో పోర్న్ సైట్‌లు చూసేవారి సంఖ్య 500 కోట్ల క్లిక్కులు కాగా, 2018 నాటికి అది 3,350 కోట్ల క్లిక్కులకు పెరిగింది. అంటే ఏడాది సగటు తీస్తే రోజుకు 10 కోట్ల వ్యూస్ అన్నమాట. పోర్న్‌హబ్ అత్యధిక వీక్షకుల్లో అమెరికా, యూకే నిలువగా మూడవ స్థానం మన భారతదేశం సంపాదించింది! దీని దారులన్నీ మనకు మన టాలీవుడ్, బాలీవుడ్.. థియేటర్లు అందిచిన ఘనత.. చూపించిన మార్గమే.
ఆడపిల్లలు సాయంత్రం ఆరింటికి ఇంటికి చేరాలనేవాళ్లం.. మగ పిల్లల్ని అర్ధరాత్రి వరకూ రోడ్లపై తిరిగేందుకు ఎందుకు అనుమతించాలి? నైతికత లేని మనకు పోలీస్ వ్యవస్థ కేవలం డ్యూటీ మాత్రమే చేయడం ఆక్షేపణీయం కాదు. అలాగే మన విద్యలో నైతికత ఎంత? ఇళ్లల్లో పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం. పోనీ సామాజికంగా మనం బాధ్యతగా ఉంటున్నామా? కుటుంబ సభ్యులంతా కలసి చూసే సినిమాలను మన ఘనతకెక్కిన దర్శకులు చూపిస్తున్నారా? కౌగిలించుకోవడం ఎవరిని ఎవరు కౌగిలించుకోవాలో అర్థం చేసుకోలేనంత పిచ్చిగా- హీరో నాగార్జున ‘బిగ్‌బాస్ షో’లో కౌగిలించుకుంటుంటే రోడ్డుపై వెళ్ళే రోమియో ఇంకేం చేస్తాడు? రోజుకు వందలసార్లు హత్యలు, రేప్‌సీన్లు, ముద్దుసీన్లు, బహిరంగ శోభనాలు మనసారా చూపించి తరింపజేస్తున్న మన మహానటుల నటన ఈ ‘కామపిశాచుల’ మెదళ్లు మొద్దుబార్చి, కళ్లు మూసుకుపోయేటట్లు చేస్తున్నది నిజం కాదా?
చట్టాల పేరుతో మానవీయత లేకుండా ప్రవర్తిస్తున్న మన వ్యవస్థ, ధనబలం, రాజకీయ బలం, కులబలం, ఓటుబలం.. ఇవన్నీ ఈ దారుణాలకు కారణాలు. మ గాళ్లను మార్చే ‘నైతికవిద్య’ ఇపుడు ఆవశ్యకం. మనిషికో పోలీసు పెట్టలేరన్నది నిజం. ఎందుకంటే ఉన్న పోలీసులంతా రాజభోగాల వాకిట్లో ‘కావలికార్లు’ అయ్యారు కదా? ఆపదలో ఉన్న యువతి మొదటిగా చెల్లికి ఫోన్ చేయకుండా పోలీసులకు చేయలేదు. వాళ్లకు భరోసా ఇచ్చే వ్యవస్థను మనం నిర్మించలేదు. ‘మగవాళ్లు ఆడవాళ్ల కోసం ఏమీ చేయకున్నా ఫర్వాలేదు.. వాళ్లను ఏమీ చేయకుండా వుంటే అదే పదివేలు’. మనందరికీ పాలు ఇచ్చి పెంచి, ఇంట్లో పాలించేవారు. వాళ్లను వాళ్లు పాలించుకోగలరు. అందుకే స్వామీ వివేకానంద ”మహిళల సమస్యలు తీర్చేందుకు మీరెవరు? మీరు దైవాలా! జాగ్రత్త! వారి జోలికి పోకండి” అన్న మాటల్లో అర్థం ఇదే. తీవ్రవాదులు బాంబులు పేల్చినపుడు చేసే హడావుడిలా- ఇలాంటి అత్యాచారాలు జరిగినపుడు మనం హడావుడి చేయడం అనే నటన మనమూ అద్భుతంగా చేస్తున్నాం. వ్యవస్థను నైతికంగా మార్చే ప్రయత్నంలో వెనుకబడ్డాం.. అందుకే ‘నిర్భయ’తో ఆగలేదు.. ‘దిశ’ చివరిది కాదు. మగాళ్లూ
మృగాలుగా మారకండి.. ప్లీజ్!