లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు

వరుసగా మూడో నెలలోనూ తగ్గని కలెక్షన్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడో నెల రూ.లక్ష కోట్లు దాటాయి. జనవరి నెల జఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయ్యాయి. కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 2017 నవంబరులో తొలిసారి వసూళ్లు రూ.1.1లక్షల కోట్లు దాటగా.. ఇది రెండోసారి కావడం విశేషం. జనవరి తొలివారంలో రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే పన్ను అధికారులతో కీలక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో వసూళ్ల లక్ష్యాన్ని రూ.1.15లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 జనవరితో పోలిస్తే ఈసారి వసూళ్లు దాదాపు 8 శాతం వ ద్ధిరేటును సాధించాయి. దేశీయ లావాదేవీల నుంచి వసూలైన జీఎస్టీ ఆదాయంలో 12 శాతం పెరుగుదల కనిపించింది. సీజీఎస్‌టీ వసూళ్లు రూ.20,944 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వసూళ్లు రూ.28,224 కోట్లు, ఐజీఎస్‌టీ వసూళ్లు రూ.58,013 కోట్లుగా వసూలయ్యాయి. సెస్సుల నుంచి రూ.8,637 కోట్ల ఆదాయం లభించింది.