కరోనాతో కలవరం

కరోనా పేరుతో ఎలాంటి మందులు లేవు…నివారణే మార్గం

  • -కేరళలో వెలుగులోకి వచ్చిన కరోనా కేసు
  • -హైదరాబాద్‌లో కరోనా పుకార్ల షికార్లు
  • -ముందుజాగ్రత్తగా మందులంటూ మార్కెట్లో హల్‌చల్‌
  • -ఎక్కువ డబ్బులు కట్టి మోసపోతున్న సామాన్యులు
  • -జలుబు, ఫ్లూ వస్తే జాగ్రత్తలు వహించాలి
  • -ముక్కు, నోటికి మాస్క్‌ ధరించాలి
  • -వైద్యుల సలహాలేకుండా నకిలీ మందులు వాడొద్దు
  • -అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌:
కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉండాలి. లేదంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తాయి. కరోనా వైరస్‌ విషయంలో నిన్న కేంద్రం చెప్పింది ఒకటైతే… ఇవాళ జరుగుతున్నది మరొకటి. ఢిల్లీ నుంచీ ముగ్గురు ప్రత్యేక నిపుణుల బ ందం హైదరాబాద్‌కి రావడం… అదే సమయంలో ఆదివారం నలుగురు ఫీవర్‌ ఆస్పత్రిలో చేరడం… హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ వ్యాపిస్తోందేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఇండియాలో కరోనా వైరస్‌ ఇంకా ఎవరికీ వ్యాపించలేదనీ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామనీ తెలిపింది. ఫీవర్‌ ఆస్పత్రిలో చేరిన నలుగురిలో… ముగ్గురు చైనా, హాంకాంగ్‌ నుంచీ వచ్చిన వారే. మరో వ్యక్తి మహిళ. ఆమె ఆ ముగ్గురిలో ఒకరి భార్య. ఆ నలుగురికీ ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కరోనా వైరస్‌ లక్షణాలే. పైగా ఆ నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి… డాక్టర్లు ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నారు. వారి నుంచీ శాంపిల్స్‌ సేకరించి… పుణెలోని వైరస్‌లను టెస్ట్‌ చేసే సంస్థకు పంపారు. అది కూడా ప్రత్యేక వాహనంలో పంపారు. ఇవాళ రిజల్ట్స్‌ వస్తాయి. వాటిలో ఏం చెబుతారో అనే టెన్షన్‌ అందరిలోనూ ఉంది. ఆ నలుగురిలోనూ ఎవరికీ కరోనా వైరస్‌ రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే… అది వస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. పైగా… ఆ వైరస్‌కి ప్రస్తుతానికి మందు లేదు కాబట్టి… అది రాకూడదని మనం కోరుకోవడం అందరికీ మేలు.
నివారణే కీలకం
ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు టీకా ఏదీ లేదు. నివారణ ఒక్కటే మార్గం. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. వైరస్‌ వ్యాప్తిలో ఉన్న చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు వెళ్లి వచ్చినవారిలో ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వీరిని ప్రత్యేకంగా విడిగా ఉంచి, చికిత్స చేయాల్సి ఉంటుంది.
– తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలి.
– జలుబు, ఫ్లూ లక్షణాలు గలవారికి దూరంగా ఉండటం మేలు.
-తరచూ చేతులను కడుక్కోవాలి. ముఖ్యంగా దగ్గిన తర్వాత, తుమ్మిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. జబ్బు బారినపడ్డవారికి సేవలు చేశాక.. వంట వండటానికి ముందు, వండేటప్పుడు, వంట పూర్తయ్యాక.. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
– జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది.
-చేతికి, నోటికి, ముక్కుకు రక్షణ లేకుండా అనవసరంగా జంతువులను తాకరాదు. ఒకవేళ జంతువులను, జంతువుల వ్యర్థాలను తాకితే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
-మాంసాహారులైతే మాంసం, గుడ్ల వంటివి బాగా ఉడికిన తర్వాతే తినాలి.
గర్భిణులు మరింత జాగ్రత్త
గర్భిణులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ అయినా మంచిది కాదు. తల్లీ బిడ్డలకూ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇక కరోనా వంటి తీవ్ర ఇన్‌ఫెక్షన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే గతంలో వెలుగుచూసిన మెర్స్‌ బారినపడ్డ గర్భిణులకు శిశువు చనిపోయి పుట్టిన ఉదంతాలున్నాయి. సార్స్‌ మూలంగా గర్భస్రావాలూ జరిగాయి. కొందరు గర్భిణులూ మరణించారు. తీవ్ర సమస్యలతోనూ సతమతమైనవారు లేకపోలేదు.
మామూలు జలుబు లక్షణాలే
తాజా కరోనా వైరస్‌ స్వరూప స్వభావాలేంటి? ఎంత తీవ్రంగా పరిణమిస్తుంది? అనేవి ఇదమిత్థంగా తెలియరావటం లేదు. ప్రస్తుతానికైతే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నా ఇది వేగంగా విస్తరిస్తున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌లోనూ ముందుగా మామూలు జలుబు లక్షణాలే కనిపిస్తాయి. ప్రధాన లక్షణాలు ఇవీ..
– ముక్కు కారటం- తుమ్ములు- జ్వరం- ఒళ్లునొప్పులు- గొంతునొప్పి- ఛాతీలో నొప్పి
– తలనొప్పి- చలి- గుండెవేగంగా కొట్టుకోవటం- రెండు మూడు రోజుల తర్వాత పొడి దగ్గు- స్వల్పంగా ఆయాసం- జీర్ణకోశ సమస్యలు- విరేచనాలు
తీవ్రమైతే న్యుమోనియాగా..
చాలావరకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ అంతగా హాని కలిగించేదేమీ కాదు. సాధారణంగా జలుబు లక్షణాలు రెండు మూడు రోజులుండి తగ్గిపోతుంటాయి. కొందరికి ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తులకు చేరుకొని శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినొచ్చు. తీవ్ర న్యుమోనియా, బ్రాంకైటిస్‌గా మారొచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు, వ ద్ధులకు, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారికి సమస్య తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ. అప్పటికీ తగు చికిత్స అందకపోతే ప్రాణాపాయానికి దారితీయొచ్చు. ఒకప్పుడు సార్స్‌ రూపంలో విజ ంభించిన కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిలో 15% మంది మ త్యువాత పడగా.. వీరిలో సగానికన్నా ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడ్డవారే. అలాగే మెర్స్‌ బారినపడ్డ ప్రతి 10 మందిలో నలుగురు చనిపోవటం గమనార్హం. కాబట్టి వ ద్ధులు, పిల్లల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. సమస్య తీవ్రమైతే కిడ్నీ వైఫల్యం, చివరికి ప్రాణాపాయమూ సంభవించొచ్చు.
లక్షణాలను బట్టి చికిత్స
కరోనా ఇన్‌ఫెక్షన్‌కు కచ్చితమైన చికిత్సంటూ ఏదీ లేదు. చాలావరకు మందులేవీ వేసుకోకపోయినా లక్షణాలు తగ్గిపోవచ్చు. మరీ ఇబ్బంది పెడుతుంటే ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు ఉపయోగపడతాయి. సమస్య తీవ్రమై శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రిలో చేర్చి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే వెంటిలేటర్‌తో క త్రిమ శ్వాస కల్పించాల్సి వస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తలెత్తితే యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేస్తారు.