దేవుని విశ్వాసులు
బైబిల్‌లోని హెబ్రీయుల పత్రికలో అపొస్తలుడైన పౌలు క్రైస్తవ విశ్వాస జీవితాన్నంతటినీ ఒకే ఒక వాక్యంలో సరళీకరించాడు. విశ్వాస జీవితాన్ని ఆయన పరుగు పందెంతో పోల్చాడు. ‘పరుగు’ అనే లక్ష్యం నుంచి సులువుగా దష్టి మళ్లించగల చిక్కులను వదిలేసి, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపే చూస్తూ ఓపికతో పరిగెత్తాలంటాడు పౌలు (హెబ్రీ 12:2). ఒక సెకనులో నూరో వంతును కూడా పరిగణనలోకి తీసుకొని పరుగు పందెంలో విజేతను ప్రకటించే విధానంలో, బహుమతి గెలుచుకోవడానికి పాల్గొనే పరుగు పందెంలో- ఆది నుంచి అంతం దాకా, లక్ష్యం నుంచి దష్టి మళ్లకుండా చూసుకోవడం ఎంత ప్రధానమైన అంశమో ఆయన వివరిస్తాడు. విశ్వాసానికి కర్త, కర్మ. క్రియ కూడా అయిన యేసే లక్ష్యంగా విశ్వాసి జీవితం సాగాలని ఆయన బోధించాడు. తనలాగే, ఒకప్పుడు యేసును శిలువ వేసిన యూదు మతస్థులుగా ఉండి, తరువాత క్రైస్తవులుగా మారిన హెబ్రీ విశ్వాసులను ఉద్దేశించి పౌలు రెండు వేల ఏళ్ళ క్రితం రాసిన పత్రిక ఇది.
దీనికి ముందున్న పదకొండవ అధ్యాయంలో విశ్వాసాన్ని ఆయన అద్భుతంగా నిర్వచించాడు. ఆ విశ్వాసాన్ని ఆచరణలో ప్రదర్శించి, దేవునికి మహిమ తెచ్చిన ఎంతో మంది భక్తులను ప్రస్తావించాడు. తిరుగులేని ఏకాగ్రతతో విశ్వాసపు పందెంలో పరుగెత్తడం అంటే ఏమిటో పౌలు సోదాహరణంగా వివరించాడు.. యేసుప్రభువే లక్ష్యంగా ఆవిష్క తమైన కొత్త నిబంధన కాలపు వినూత్న విశ్వాసానికి ఉన్న పాత నిబంధన మూలాల్ని పౌలు ఈ ఒక్క మాటలో విశదపరిచాడు.
‘యేసే గురి (లక్ష్యం)గా పరుగెత్తడం’ అంటే, యేసుక్రీస్తులా జీవించడం అనీ, క్రీస్తు వాసనలు లేని క్రైస్తవం నేతి బీరకాయ లాంటిదనీ దాని అర్థం. ‘క్రీస్తులా ప్రేమించడం, క్రీస్తులా ఆలోచించడం, క్రీస్తులా క్షమించడం, క్రీస్తులా లోకాన్ని ప్రభావితం చెయ్యడం, ముఖ్యంగా క్రీస్తులా శ్రమ పడడమే నిజమైన క్రైస్తవం అనేది’ దాని సారాంశం. యేసే సర్వస్వంగా ఉండాల్సిన విశ్వాసంలో ధనం, ధనార్జన అనే అంశాల ప్రమేయం, ప్రస్తావన బైబిల్‌లో లేదు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, అధికారం కోసం సాగే పాకులాటే యేసుపై నుంచి విశ్వాసి దష్టి మళ్లించి, భ్రష్టుణ్ణి చేస్తుంది. ఇవి సులువుగా చిక్కుల్లో పడేసే పాపాలు! వీటిని అధిగమించగలిగిన వాళ్ళే పందెంలో విజేతలు. వాళ్ళే దేవుని దష్టిలో నిజమైన విశ్వాసులు. గమ్యం చేరేందుకు ఒక పడవ చాలు. రెండు పడవల్లో కాలుపెట్టినవాడు నీళ్లలో పడి మునిగి పోతాడు. సంపూర్ణమైన స్పష్టత, ఏకాగ్రతతో, ఎంతో సంక్లిష్టమైన బాధ్యతల్ని దేవుని కోసం నెరవేర్చడమే క్రీస్తు పరిమళాల్ని వెదజల్లే విశ్వాస జీవితం. హెబ్రీ పత్రికలో ఇలా పౌలు రాసిన ప్రతి మాటా ఆయన జీవితంలో నుంచే వచ్చింది.