ఒక్క దీపం చాలు
ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి వేళ ఒక్క దీపం వెలిగించినా కోటిజన్మల పుణ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు తీర్మానించాయి. మొత్తం ఏడాదికి వర్తించే 356 వత్తులను వెలిగించడమూ ఆనవాయితీ. దీప కిరణానికి విజ్ఞానశాస్త్ర రీత్యాకూడా తిమిరాన్ని (చీకటి)ని పోగొట్టే శక్తి ఉంది కదా. ప్రతిరోజు పొద్దున, సాయంత్రం దీపాలకు దండం పెట్టుకోవడం ఉత్తమ సంస్కారం. వచ్చే పున్నమినాడు ఇండ్లలో దేవుని గదిలో లేదా శివ-వైష్ణవాలయాలలో తెలిసో తెలియకో దీపారాధన చేసేవారికి సర్వపాపాలు తొలగిపోయి ‘స్వర్గప్రాప్తి తథ్యమని’ వేదవిజ్ఞానులు చెబుతున్నారు. ఇంకా ప్రత్యేక అర్చనలు, పూజలు, అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనల ఫలితం గురించి చెప్పనవసరం లేదని వారంటారు. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ..’ అంటూ దీపాన్ని పరబ్రహ్మతో పోల్చింది మన భారతీయ ధార్మికత. సాక్షాత్తు ఈశ్వరుడే దీపస్వరూపుడు. కనుక, దీపానికి చేసే నమస్కారం నేరుగా ఆయనకే. మాసాలన్నింటిలోకి ఉత్క ష్టమైన కార్తీకంలో ప్రతి రోజూ దీప, దేవతారాధనలు, వేద పారాయణాలు ఎంతో పుణ్యప్రదం. ముఖ్యంగా ఈనెలలోని సోమవారాలు, ఏకాదశులు, శుద్ధద్వాదశి, పౌర్ణమి రోజులు అయితే, మరింత ప్రభావవంతమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ‘దేవ దీపావళి’గా పిలిచే కార్తీకపౌర్ణమి మహిమను కార్తీక మహాపురాణం చాలా గొప్పగా అభివర్ణించింది.