పురాతన హిందూ దేవాలయం

ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మత పరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. చాలా వరకు పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమయ్యాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ సజీవంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్‌ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడినాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.