కొత్త కొత్తగా చేసెయ్యండిలా..
సమీర డిగ్రీ వరకు చదువుకున్నది. ఏదో చేయాలనే తపన ఉండేది. కానీ.. పెండ్లి.. పిల్లలు.. సంసారం బాధ్యల్లో మునిగిపోయి కెరీర్‌కు ఆప్షన్ లేకుండా పోయింది. పొద్దున పదింటికల్లా భర్త ఆఫీస్‌కు.. పిల్లలు స్కూల్‌కు వెళతారు. సుజాత ఆ పనీ.. ఈ పనీ చేసేసుకొని టీవీ ముందు కూర్చునేది. డైలీ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం పొందేది. అదే దినచర్యగా అలవాటైపోయిందామెకు. ఒక్కోసారి ఆత్మవిమర్శ చేసుకొని నేను చదివిన చదువు ఏంటి? చేస్తున్న పని ఏంటి? అని ప్రశ్నించుకునేది. కెరీర్‌కు ఆప్షన్ లేకపోవడం కాదు.. తానే కొన్ని ఆప్షన్లు స ష్టించాలనుకున్నది. ఆన్లైన్లో జువెలరీ.. వన్‌గ్రామ్ గోల్డ్ డిజైనింగ్.. మార్కెటింగ్ నేర్చుకున్నది. కట్‌చేస్తే.. ఇప్పుడు ఆమె సొంతంగా ఒక బొటిక్ ఏర్పాటుచేసింది. దానికి కొత్త సంవత్సరాన్నే వేదికగా మార్చుకొని కొత్త జీవితం ప్రారంభించింది.
ప్రతీ ప్రారంభం.. కొన్ని ప్రారంభాల ముగింపు నుంచి వస్తుంది అనే లైన్లో ఆలోచించి అడుగేయండి. పైన ఉదహరించిన ఇద్దరి విషయాల్లోనూ కామన్ పాయింట్ కొత్త జీవితం. అది ఎలా సాధ్యమైంది? కొత్త సంవత్సరం సందర్భంగా మార్పు అనే ఒక ఆలోచన ద్వారా. కాబట్టి కొత్త సంవత్సరం ఉత్సవాలు మార్పు వేదికగా జరిగితే బావుంటుంది. థర్టీఫస్ట్ నైట్ ఉత్సవాలను సంవత్సరాంతం వేడుకలుగానే కాకుండా ఇంకో సంవత్సరానికి ఆరంభంగా సెలబ్రేట్ చేసుకుంటే కొంతలో కొంతైనా మార్పు ఉంటుంది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయం సమీపిస్తోంది. మనలో చాలమంది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలనో, లేదంటే ఫలానా పని చేయకుండా ఉండాలనో తీర్మానాలు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా అవ్వొచ్చు, కెరీర్ కావచ్చు, లేదంటే ఇప్పటికే ఉన్న కొన్ని అలవాట్లను మార్చుకోవాలని కావచ్చు.. విషయం ఏదైనా చాలామంది ఏదో ఒక తీర్మానం మాత్రం చేసుకుంటారు. అస్పష్టమైన ప్రణాళికలు ఎక్కువగా విఫలం అవుతాయి. తీర్మానం ఏదైనా ప్రేరణ లేకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అసాధ్యం. ఆ విషయం మనలో చాలామందికి అనుభవపూర్వకంగా అర్థమయ్యే ఉంటుంది.
యూనివర్సిటీ ఆఫ్ స్క్రాన్టన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకునేవారిలో కేవలం 8 శాతం మంది మాత్రమే అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారు. మిగతా 92 శాతం మందిలో మీరు ఉండకూడదు అనుకుంటే, లక్ష్య సాధనలో విఫలం కాకుండా ఉండాలంటే ఈ అయిదు సులభమైన మార్గాలను తప్పక అనుసరించండి.
చిన్న లక్ష్యాలతో పని మొదలు పెట్టాలి
వాస్తవ లక్ష్యాలను పెట్టుకుంటే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
”సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. ఈ ఏడాదిలో నేను పూర్తి భిన్నమైన వ్యక్తిగా మారిపోవాలి అనే తప్పుడు ఊహలతో అలా చేస్తాం” అంటారు మానసిక నిపుణులు రాషెల్ వైన్‌స్టీన్. చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఉదాహరణకు, నేరుగా వెళ్లి కిలోమీటర్ల దూరం సాగే మారథాన్‌లో పాల్గొంటానని అనుకోకుండా.. ముందు రన్నింగ్ షూ కొనుక్కుని కొద్ది కొద్దిగా పరుగెత్తడం మొదలుపెట్టాలి. లేదా మీకు వంట చేయడం ఇష్టమైతే, వంటింట్లో పెద్దలకు సాయపడండి. కనీసం వారంలో ఒక వంట చేసినా రానురాను మీ నైపుణ్యం పెరుగుతుంది. దీని ఉద్దేశం మీ లక్ష్యాలను తగ్గించుకోవడం కాదు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.
”మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. అది వాస్తవం” అంటారు వెయిన్‌స్టీన్.
పక్కా ప్రణాళికతో పని ప్రారంభించాలి
నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్కరికీ..మనం చాలాసార్లు కొత్త ఏడాది వచ్చింది కదా అని.. సరైన ప్రణాళిక లేకుండానే తీర్మానాలు చేసేసుకుంటాం. కానీ, సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి పక్కాగా ఆలోచించాలి.
”ఇక నుంచి జిమ్‌కు వెళ్లడం మీద ఎక్కువ దష్టిపెడతా” అని సింపుల్‌గా చెప్పకుండా… ”ప్రతి మంగళవారం మధ్యాహ్నం, శనివారం ఉదయం జిమ్‌కు వెళ్తా” అని నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నెయిల్ లెవ్వీ. అలా, కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ఆచరణలో పెట్టడం సులువవుతుంది. ఇతరులతో కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేయడం మంచి ఫలితాలు ఇస్తుంది
తోడు తెచ్చుకోండి
మీతోపాటు తోడుగా ప్రయాణం చేసేందుకు మరికొందరిని వెతికి పట్టుకోగలిగితే లక్ష్య సాధనకు మార్గం మరింత సుగమమం అయినట్లే. ”ఇకనుంచి ఫలానా స్నేహితుడితో కలిసి కాలేజీకి వెళ్తాను. మా ఇద్దరిదీ ఒకే లక్ష్యం” అని ఒక నియమం పెట్టుకోవడం కూడా అలాంటిదే. అలా, ఒకసారి చేయడం మొదలు పెడితే, రానురాను ఆ నిబద్ధత మరింత మెరుగుపడుతుంది. దాంతో అనుకున్న శిఖరాన్ని చేరుకోవడం చాలా సులభమవుతుంది. కలసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా.. ”మనం విఫలమైతే ఆ ప్రభావం తోటి వారి మీద పడుతుంది. మనతోపాటు ఇతరుల జీవితం కూడా పాడవుతుంది” అన్న ఆలోచనతో ఆ ప్రయత్నం నుంచి వెనకడుగు వేయకుండా ఉంటారని వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన తత్వవేత్త డాక్టర్. జాన్ మైకేల్ చెబుతున్నారు. కాబట్టి, లక్ష సాధన కోసం ఇతరులనూ కలుపుకుపోవడం మరింత సహాయపడుతుందన్న విషయాన్ని మరవకూడదు.
ఓటమిని జయించడం
ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది మీలో పట్టుదలను మరింత పెంచుతుంది. ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచే మరో మార్గం ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రయత్నించవచ్చు.
రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకుంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పదార్థాల వైపు వెళ్లొచ్చు. శీతల పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవడం తగ్గిస్తే మరికొన్ని ఫలితాలు కనిపిస్తాయి.
సంకల్పం మాత్రమే సరిపోదు
దీర్ఘకాలిక లక్ష్యాలపై దష్టి పెట్టాలి. ముందు చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. అయితే, అవి తమ దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ఉండాలి. అంటే, ఒక పద్ధతి ప్రకారం లక్ష్యాలను ఎంచుకోవాలి. క్రీడల మీద ఆసక్తి లేకుండా, అత్యద్భుతమైన అథ్లెట్ అవ్వాలనుకోవడం సాధ్యం కాని పని. అందుకే, ”కేవలం సంకల్ప బలాన్ని నమ్ముకునే వారు ఎక్కువగా విఫలమవుతారు” అంటారు మానసికవేత్త డాక్టర్. అన్నే స్విన్బార్నె. ఫలానా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు, ఆ రంగం పట్ల ఆసక్తి ఉండాలి. అందుకోసం మొదటి రోజు నుంచే ప్రణాళికా బద్ధంగా పని మొదలు పెట్టాలి. మధ్యలో అవాంతరాలు ఎదురైనప్పుడు ఇతరుల సాయం తీసుకునేందుకూ సంకోచించకూడదు.