డేటా చోరీ జరగలేదు

ఐటీ గ్రిడ్‌ వ్యవహారంపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సష్టించిన ఆధార్‌ డేటా చోరీ కేసులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్‌ డేటా ప్రైవేటు సంస్థలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆధార్‌ డేటా చోరీ ఉత్పన్నమయ్యే సమస్యే లేదని తేల్చి చెప్పింది. ఐటీ గ్రిడ్‌ వ్యవహారంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురువారం ప్రశ్న లేవనెత్తారు. గతంలో ఈ విషయమై వైసీపీ నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. ఐటీ గ్రిడ్‌ ద్వారా ఆధార్‌ డేటాను టీడీపీ చోరీ చేసిందని అప్పట్లో ఆరోపణలు చేసింది. ఐటీ గ్రిడ్‌, టీడీపీలపై ఎన్నికల కమిషన్‌కు కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. కేవీపీ ప్రశ్నకు ఐటీ శాఖ సహాయమంత్రి సంజయ్‌ ధాత్రే సమాధానమిచ్చారు. ఐటీ గ్రిడ్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును తన సమాధానంలో సంజయ్‌ ధాత్రే ప్రస్తావించారు. ఆధార్‌ చట్టానికి విరుద్ధంగా ఐటీ గ్రిడ్‌ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల వివరాలను సేకరించినట్టు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నివేదిక ఇచ్చింది. పలు సర్వీస్‌ ప్రొవైడర్లు వ్యక్తుల నుంచి నేరుగా వారి ఆధార్‌, ఇతర వివరాలు సేకరించడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ సమాచారాన్ని నిర్దుష్టంగా దేని కోసం సేకరించారో దాని కోసమే వినియోగించాలి. సదరు వ్యక్తి సమ్మతం లేకుండా సమాచారాన్ని ఇతర వ్యక్తులకు అందించకూడదు. ఆధార్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్‌ చేయవచ్చునని యూఐడీఏఐ ప్రకటించింది.