కెసిఆర్ ఎత్తుగడలతో చిత్తవుతున్న కాంగ్రెస్
ఎమ్మెల్యేలు, పార్టీ నేతల చేరికలతో బేజార్
టిఆర్‌ఎస్ వ్యూహంలో నిలవలేకపోతున్న కమలదళం
హైదరాబాద్,అక్టోబర్24(ఆర్‌ఎన్‌ఎ): హుజూర్‌నగర్ ఫలితాన్ని విశ్లేషిస్తే కాంగ్రెస్‌లో పోరాడే సైనికులు కానరావడం లేదు. అలాగే పార్టీకి పట్టుగా ఉన్ననేతలను కోల్పోయింది. గెలిచిన ఎమ్మెల్యేలంతా అధికార
పార్టీలో చేరడంతో రెక్కలు తెగిన పక్షిలా కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా వేసే అడుగులను పసిగట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. కెసిఆర్ వేస్తున్న ప్రతి అడుగు వెనక రాజకీయ
కోణం ఉందన్న విషయాన్ని ప్రతిపక్షాలు అంచనా వేయడంలో విఫల మయ్యాయి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే వారిలో ఆత్మవిశ్వాసం లోపించినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని, లాభపడేది తామే అని చెప్పుకుంటూనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడ్డారు. ఇప్పుడు కూడా తామే గెలుస్తామన్న అతి విశ్వాసంలో నేతలు నిద్రతమత్తులో ఉన్నారని హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వెల్లడించింది. కెసిఆర్ వ్యూహం ఏమై ఉంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. రాజకీయాలలో కేసీఆర్ వేసే అడుగులను అంచనా వేసి తదనుగుణంగా ప్రతివ్యూహాలను రచించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూ వస్తోంది. 2014 ఎన్నికలలో దాదాపు పది మంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. ఇదే అదనుగా భావించిన కేసీఆర్ తన సహజ ధోరణికి భిన్నంగా తెలంగాణవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగి పార్టీ తరఫున ప్రచారం చేసుకున్నారు. దీంతో ఎన్నికలలో ఆయన శ్రమ ఫలించింది. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. అందుకే కాంగ్రెస్, బిజెపిలను వ్యూహాత్మకంగా దెబ్బకొడుతూ, వారి పాలనకాలాన్ని నిశితంగా విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలలోకి దూసుకుపోయిన కేసీఆర్, పార్లమెంట్ ఎన్నికల్లోనూ, పంచాయితీ ఎన్నికల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రేపటి మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బిజెపిలకు ఇవే ఫలితాలు కనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఎన్నికలు ఏవైనా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో సమరోత్సాహం కనిపిస్తోండగా, ప్రతిపక్షాలలో బేలతనం ప్రస్ఫుటంగా ఉంది. కెసిఆర్ అడుగులు ఎటు పడుతున్నాయన్నది గ్రహించి ప్రతిచర్యలు తీసుకోవలసిన ప్రతిపక్షాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తాయనడానికి హుజూర్ నగర్ ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.