ఊరెళితే..ఊడ్చేస్తారు

దసరా సెలవలకు ఊళ్లకి వెళ్లాలంటే భయపడుతున్న జనాలు
సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
  • -దసరా సెలవలతో ఊళ్లకు వెళుతున్న జనాలు
  • -ఇదే అదనుగా పగటిపూటే దొంగతనాలు
  • -నగరంలోకి ప్రవేశించిన అంతర్రాష్ట్ర ముఠాలు
  • -ఇండ్ల తాళాలు పగులగొడుతూ హల్‌చల్‌
  • -అప్రమత్తమైన గ్రేటర్‌ పోలీసులు
  • -పండుగలకు ఊరెళ్తే సమాచారం ఇవ్వాలని సూచన

హైదరాబాద్‌ : నగరంలోకి దసరా దొంగలు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాలు ప్రవేశించాయని, తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని చోరీలకు శ్రీకారం చుట్టాయని భావిస్తున్నారు. ఇటీవల ఆదిబట్ల, మీర్‌పేట్‌, కీసర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలను పరిశీలించిన అధికారులు దసరా సెలవుల్లో చాలా మంది ఇంటికి తాళం వేసి సొంతూర్లకు వెళ్లారనే కచ్చితమైన సమాచారంతోనే వారు వచ్చారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నగరంతోపాటు, శివారు ప్రాంతాలను టార్గెట్‌ చేసినట్టు తెలుస్తున్నది. జనం తక్కువగా ఉండడం, ఇండ్లు దూరంగా ఉండడం, పోలీసులకు చిక్కకుండా క్షణాల్లో తప్పించుకొని పోయే అవకాశం ఉండడంతో శివారు ప్రాంతాలపై ఎక్కువగా దష్టి పెడుతున్నారు. అందరూ గాఢనిద్రలో ఉండి, పోలీస్‌ గస్తీ తక్కువగా ఉన్న సమయంలో చోరీలకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కో ముఠాలో దాదాపు 10 మంది సభ్యు లు ఉంటున్నారు. అందరూ కలిసి లేదా అవకాశం ఉన్నచోట రెండు ముఠాలుగా విడిపోయి రెచ్చిపోతున్నారు. అడ్డువచ్చిన వాళ్లపై దాడిచేసేందుకు తమ వెంట కంకర రాళ్లను తెచ్చుకొంటున్నారని తెలిసింది. చోరీకి ముందు వారు ఆటోలు, బస్సుల్లో వచ్చి రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్‌ వేస్తున్నారని, రాత్రి 12 గంటలకు టార్గెట్‌ ఏరియాకు చేరుకొని అర్ధరాత్రి 2 గంటల నుంచి తెలవారుజామున 4 గంటల లోపు తమ పనిని ముగించుకొని వెళ్లిపోతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఎస్‌ఎంఎస్‌ చేసినా.. రక్షణ కల్పిస్తాం
సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేవారికోసం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. వెళ్లేముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలి. ఇంటి వివరాలతో ఎస్‌ఎంఎస్‌ లేదా వాట్సాప్‌ మెసేజ్‌ పంపాలి. తద్వారా ఆయా ప్రాంతాల్లో గస్తీ పెంచుతారు. ఇంట్లో విలువైన వస్తువులను పెట్టుకోవద్దు. తాళాలు బయటికి కనబడకుండా వేయాలి. బీరువాలు, గదుల తాళంచేతులన్నీ వెంట తీసుకెళ్లాలి. రాత్రుళ్లు కనీసం ఒక్క బల్బ్‌ అయినా వెలిగేలా చూసుకోవాలి. పాల ప్యాకెట్లు, న్యూస్‌ పేపర్లు రోజుల తరబడి బయటే పోగుకాకుండా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వాకిలి నిత్యం శుభ్రం చేయించే ఏర్పాటు చేసుకోవాలి.
యువత గస్తీ నిర్వహించాలి
దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక యువత బ ందాలుగా ఏర్పడి గస్తీ నిర్వహించాలి. రాత్రుళ్లు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేసేందుకు పక్కింటి వాళ్ల నంబర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. రాచకొండ వాట్సాప్‌ 9490617111 లేదా డయల్‌ 100కు సమాచారం అందించండి. తాళం వేసి వెళ్లేవారు మాకు సమాచారం అందించి నిశ్చింతగా పండుగ జరుపుకోండి.
ఇళ్లకు తాళాలు వేసి దసరా సెలవులకు బయటకు వెళ్లే ప్రజలు ముందు జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది. దొంగతనాలు, దోపిడీలు జరుగుతుండడంతో ఊరువెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇంటి యజమానులపై ఉంది. తాళం వేసింది వేసినట్టుగానే ఉన్నా ఇంటి వెనుక నుంచి తలుపులో, కిటికీలో బద్దలుకొట్టి ఇంటిలోకి జొరబడి దొంగతనాలు జరుగుతున్న సందర్భాలు మనం చూస్తునే ఉన్నాం. తాళాలు వేసిన ఇళ్లను సైతం పగులకొట్టి ఇళ్లను దోచుకుపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దొంగతనాలకు మూలకారణం ప్రజలలో అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. జరుగుతున్న దొంగతనాలను, దోపిడీలను కళ్లకు కట్టినట్టుగా మీడియాలో చూస్తున్న నేటి ప్రజలు మళ్లీ అదే నిర్లక్ష్యానికి గురౌతున్నారు. అది ఆసరాగా చేసుకుంటున్న దొంగలు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.
రాత్రి పగలు అనక దొంగతనాలు చేస్తున్న ఈ దొంగల ముఠాలు చాకచక్యంగా తప్పించుకుంటున్నాయి. ఇలాంటి దొంగలకు చెక్‌పెట్టాలంటే కనీస బాధ్యతలు గ్రహించాల్సిన అవసరం ఇంటి యజమానులపై, ప్రజలపై ఎంతైనా ఉంది. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు మనవాళ్లు పక్కింటివారికైనా సమాచారం ఇవ్వరు.. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లలో సైతం తాము ఊరు వెళుతున్నట్లు ఫిర్యాదు కూడా చేయరు. ఎందరో యజమానులు ఈ దొంగల దోపిడీకి గురౌతున్నారు. నగరంలో అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండే అలవాట్లు ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు . వాళ్లంతా అర్ధరాత్రి తరువాత తెల్లవారే వరకు నిద్రమత్తులో ఉండిపోతారు. ఇలాంటి సమయాన్ని ఆసరా చేసుకుంటున్న ఆ దొంగలు ఇంట్లో మనుషులు ఉండగానే ఇంట్లో పడి బీరువాలో ఉన్న నగా నట్రా దోచుకువెళుతున్నారు. వేసవి కాలం కావడంతో ఇంట్లో ఉక్కపోత ఉండడంతో తలుపులను తెరచి నిద్రపోతున్నవారు ఎందరో.. ఇలాంటివారే ఈ దొంగల చేతులలో బలౌతున్నారు. దసరా పండుగకు పదిహేను రోజలు పాటు సెలవులు ఉండడంతో తమ పిల్లా పాపలతో విహారయాత్రలకు, ఆలయాలకు వెళ్లే కుటుంబ యజమానులు ఊరు వెళ్లే ముందు జాగ్రత్తలు పాటించాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు..
ఇంటికి తాళం వేసే ముందు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఆ యింటి యజమాని పూర్తి సమాచారాన్ని వారికి తెలియపరచాలి. ఇంటిపక్కన ఉండే వారికి తాము ఊరు వెళ్లే సమాచారాన్ని అందివ్వాలి.
ఇంటికి వెనుక భాగంలో ఉండే కిటికీలను, తలుపులను గట్టిగా బందోబస్తు చేయాలి. అవసరమైతే వాటికి ఎలక్టాన్రిక్‌ అలారం సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం మంచిది.
ఇంటికి తాళం వేసే ముందు ఇంట్లో ఉండే బంగారు నగలను, నగదును, విలువైన ఎలక్ట్రానినిక్‌ వస్తువులను ఉంచరాదు. బంగారాన్ని, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి.
ఇంటికి తాళం వేసే ముందు ఇంట్లో, ఇంటి వెనుకాల ఉండే తలుపులు, కిటికీలు వేసామో లేదో గ్రహించాలి. ముందు డోర్‌కు తాళం వేసిన తరువాత తాళం కనిపించకుండా కర్టెన్‌ వేయాలి.
మీరు ఎన్ని రోజులు ఊరుకు వెళుతున్నారో అది ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. ఆ సమయం వరకు ఇంటి వద్ద వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. కాలనీ అసోసియేషన్‌కు తాము ఊరు వెళ్లే సమాచారాన్ని ఇవ్వాలి. అవసరమైతే వారు గూరా?లను ఏర్పాటు చేస్తారు.
వేసవి కాలంలో నిద్రమత్తులో ఉండే వారందరూ ఎలక్ట్రానిక్‌ అలారం సిస్టమ్‌ను అమర్చుకోవాలి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, అప్పుడే నిద్రించేవారు తెల్లవారినా గాఢనిద్రలో ఉండడాన్ని దొంగలు గ్రహిస్తారు. పడుకునే ముందు కిటికీలను, తలుపులను గట్టిగా బిగించాలి.
వేసవి కాలం అని భవనాలపై ఓపెన్‌ ప్రదేశాలలో నగలు ధరించి ముఖ్యంగా మహిళలు పడుకోవడం సరికాదు. ఇంటికి తాళాలు వేసి స్లాబులపై పడుకునే వారందరూ తమ ఇంట్లో ఉండే విలువైన బంగారు నగలను, డబ్బులను బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలి. తమ శరీరంపై ఉండే బంగారు నగలను సైతం భద్రపరచుకోవాలి.
తాము ఊరు వెళుతున్నట్లు తమకు దగ్గరలో ఉండే బంధువులకు, స్నేహితులకు సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ విషయాలన్నింటినీ కాలనీలలో ఉండే ఇంటి యజమానులు తప్పక పాటించే అవసరం ఉంది.
మీ సంబంధిత ప్రాంత పోలీసుస్టేషన్‌ ఫోన్‌నెంబర్లు, అధికారుల నెంబర్లతోపాటు కాలనీలోని ఇరుగు పొరుగు నెంబర్లు వెంట పెట్టుకెళ్లాలి. అవసరమైనప్పుడు మన ఇరుగుపొరుగు ప్రాంతాల వారిని ఫోన్‌ చేసి పలకరించాలి. వారితో టచ్‌లో ఉండాలి