కదం తొక్కిన రైతన్నలు
దేశ రాజధానికి పాదయాత్రగా బయలుదేరిన కర్షకులు
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వేలాది మంది ఉత్తర్‌ప్రదేశ్ రైతులు దేశ రాజధానికి పాదయాత్రగా బయలుదేరారు. చెరకు రైతుల బకాయిలను చెల్లించడం సహా ఉచిత విద్యుత్ లాంటి 16 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సహరాన్‌పూర్ నుంచి రాష్ట్రీయ కిసాన్ సంఘ్ నేత త్వంలో సెప్టెంబరు 11నే పాదయాత్ర ప్రారంభించిన వీరు నోయిడాలో భారతీయ కిసాన్ సంఘటన్, వ్యవసాయశాఖ అధికారులతో చర్చలు జరిపారు. కానీ, అవి విఫలం కావడంతో శనివారం ఉదయం ఢిల్లీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎన్‌హెచ్-24 ద్వారా వీరు నేరుగా దేశ రాజధానిలోని కిసాన్ ఘాట్‌కు చేరుకున్నారు. అయితే వీరిని మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 11మంది ప్రతినిధులను పంపారు. ప్రస్తుతం వీరు వ్యవసాయ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తమ సమస్యలపై ఏ ఒక్క రాజకీయ నాయకుడు దష్టి సారించడం లేదని..తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు తెలిపారు.
పాదయాత్ర నేపథ్యంలో యూపీ నుంచి దిల్లీ వెళ్లే రహదారిపై పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాత్ర సాగుతున్న మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే దిల్లీ శివారులోకి చేరుకోగానే రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.