పురపాలక చట్ట సవరణ బిల్లుకు

ఆమోదం
శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్‌
  • -పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు
  • -తక్కువ కాలవ్యవధిలో మెరుగైన సేవలు
  • -సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లుకు ఆమోదం
  • -ఐటీఐఆర్‌కు నయాపైసా ఇవ్వలేదు
  • -టీఎస్‌ఐపాస్‌తో 12.67 లక్షల ఉద్యోగాలు
  • -5.5 లక్షలకు చేరిన ఐటీ ఉద్యోగులు
  • -పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
  • -అందుబాటులో సిటిజన్‌ ఫ్రెండ్లీ అర్బన్‌ పాలన

హైదరాబాద్‌:
హైదరాబాద్‌: ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో తెలంగాణలో తీసుకొచ్చిన పురపాలక చట్టసవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు కావాలని అన్నారు. జవాబుదారీ తనంలో తక్కువ కాలవ్యవధిలో మెరుగైన సేవలు పొందేలా సవరణలు చేసినట్లు వివరించారు. జులై 2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 5 సవరణలు చేయగా.. ఎలాంటి చర్చ లేకుండా పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మరోవైపు సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ చేపట్టకుండానే సభ ఆమోదం తెలిపింది.
యూపీఏ హయాంలో ఐటీఐఆర్‌కు నయాపైసా ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పురోగతిపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుడు బట్టి విక్రమార్క ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో 12.67 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఐటీ రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తున్నామన్న కేటీఆర్‌.. ఆ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 5.5 లక్షలకు చేరిందని తెలిపారు.బెంగళూరును తలదన్నేలా ఐటీలో దూసుకెళ్తున్నామని వివరించారు. గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలను బెంగళూరును కాదని హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నందునే రాష్ట్ర వ ద్ధి రేటు అధికంగా ఉందని మంత్రి వివరించారు. ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్‌ సవరణ బిల్లు-2019ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ బిల్లుకు సంబంధించిన వివరాలు సభలో వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో, నగరాల్లో పాలన కోసం ఆరు వేరువేరు చట్టాలు అమలులో ఉన్నాయి. ఇవన్నీ చాలా పురాతనమైనవి, చాలా ఏళ్ల క్రితం నాటివి. పట్టణ పరిపాలనలో ఎన్ని బిల్లులు, చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ.. ఆయా చట్లాల్లో ఉన్న లోపాల వల్ల, వాటి కార్యచరణ సక్రమంగా సాగడం లేదు. దీనివల్ల పట్టణ ప్రణాళిక అనుకన్న విధంగా ముందుకు సాగడం లేదు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-1965, తెలంగాణ మున్సిపల్‌ చట్టం-1994, టౌన్‌ మరియు కంట్రీ ప్లానింగ్‌ చట్టం-1920, అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ చట్టం-1975, జీహెచ్‌ఎంసీ యాక్ట్‌-1955, హెచ్‌ఎండీఏ యాక్ట్‌-2008 ఈ ఆరు చట్టాలు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులకు తగ్గట్లు రూపొందిచారు.
ఆ చట్టాలకు నేటి పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదు. జనాభా పెరిగింది, పట్టణీకరణ మారింది. నేటి పరిస్థితులకు తగ్గట్లు, ప్రజల అవసరాలకు తగ్గట్లు ఈ ఏడాది జూలై 19 నాడు సీఎం కేసీఆర్‌ గారు తమరి(స్పీకర్‌) అనుమతితో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్ధేశ్యం టీ-ఎస్‌ ఐపాస్‌ ఏ విధంగానైతే విజయవంతమైందో, (అంటే పరిశ్రమల అనుమతులను వేగవంతం చేయడం) ఈ చట్టం ద్వారా కూడా పారదర్శకమైన అనుమతులను, విధానాలను తీసుకురావాలన్నది ప్రధానాంశం. పురపాలన అంటే పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం, పురపాలనలో పౌరుడే కేంద్రబిందువు కావాలనీ, పౌరుడే పాలకుడు కావాలనే సదుద్ధేశ్యంతో సిటిజన్‌ ఫ్రెండ్లీ అర్బన్‌ పాలనను అందుబాటులోకి తెస్తున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం, అనుమతులు త్వరితగతిన ఇవ్వడం, పూర్తి పాలనను పారదర్శకంగా ఉండేలా చూసుకోవడం, నగర మరియు పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం ఈ చట్టం ఉద్దేశ్యం అని, ఇందులో పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనట్టు మంత్రి తెలిపారు. ఈ బిల్లును స్పీకర్‌ సభ్యుల అనుమతితో ఆమోదించారు.
ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా హీటెక్కింది. ఐటీఐఆర్‌పై అధికార-ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్‌-ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అభివ ద్ధి చెందాలనే యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్‌ను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు జరిపిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రాజెక్టును సాధించలేదని నిలదీశారు. ఐటీఐఆర్‌ ద్వారా మొత్తం 70 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికైనా కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. అలాగే అసెంబ్లీలో కూడా ఐటీఐఆర్‌ కోసం తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు
భట్టి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. ఐటీఐఆర్‌ విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2013లో బెంగుళూరు, హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ అనుమతి ఇచ్చిందన్నారు. కానీ ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. అయినా ఆఫీసు స్పేస్‌ ఆక్యుపెషన్‌లో బెంగళూరును హైదరాబాద్‌ దాటిందన్నారు. ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని తాము చూడట్లేదన్నారు. మా పని మేము చేసుకుని పోతున్నామన్నారు. ఐటీఐఆర్‌ కోసం కాంగ్రెసోళ్లేదో ఉద్ధరించినట్లు…తామేదో నాశనం చేసినట్టు మాట్లాడం సరికాదని హితవు పలికారు. అవును తెలంగాణ ఉద్యోగాల కోసమే వచ్చిందన్నారు. ఐటీఐఆర్‌ విషయంలో యూపీఏ ఒక కాగితం పారేసి పోయిందని దెప్పిపొడిచారు. ఇకనైనా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు మాని అభినందించడం నేర్చుకోవాలని కేటీఆర్‌ చురకలంటించారు.
పంచ ప్రసిద్ధి టెక్నాలజీ సంస్థలు హైదరాబాద్‌ వైపు చూస్తుంటే.. హర్షించాలి తప్ప అక్కసు పెంచుకోవడం సరికాదని మంత్రి కేటీఆర్‌ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మాటిమాటికి తెలంగాణలో ఎలాంటి అభివద్ధి జరగలేదంటూ ఎద్దేవా చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో పరిశ్రమల పద్దుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. 2014-15లో హైదరాబాద్‌ ఐటీ ఎగుమతులు దాదాపు రూ. 57 వేల కోట్లుగా ఉంటే 2018-19 నాటికి రూ. 1,02,219 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో 17 శాతం వ ద్ధి నమోదైందన్నారు. రూరల్‌ టెక్నాలజీ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌లు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో టాస్క్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు.