కాంగ్రెస్‌ ఆధిపత్య పోరు

రేవంత్‌ బీ(జే)పీ!!

కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డిపై పెరుగుతున్న అసమ్మతి గళం..అదునుచూసి బీజేపీ గాలం
  • టీ.కాంగ్రెస్‌లో తారాస్థాయికి చేరిన విభేదాలు
  • టీపీసీసీ పదవి ఆశించిన రేవంత్‌కు భంగపాటు
  • రేవంత్‌ పొడ గిట్టని సీనియర్‌ నేతలు
  • అగ్గి రాజేసిన హుజూర్‌నగర్‌ సీటు
  • భార్య పేరు ఖరారు చేసిన ఉత్తమ్‌కుమార్‌
  • హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన రేవంత్‌
  • ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీత
  • మళ్లీ వర్గాలుగా చీలిపోతున్న టీ.కాంగ్రెస్‌
  • రేవంత్‌తో టచ్‌లో ఉన్న బీజేపీ నేతలు
  • కీలక పదవి ఇస్తామంటూ బీజేపీ ఆఫర్‌

హైదరాబాద్‌:
టీకాంగ్రెస్‌లో విభేదాలు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఎంపీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రరూపం దాల్చినట్లు చర్చ నడుస్తోంది. గడప దాకా వచ్చిన టీపీసీసీ పదవిని తనకు కాకుండా చేయడంతో రేవంత్‌ రెడ్డి ప్రతీకారంతో రగిలి పోతున్నారు. ఉత్తమ్‌పై రివెంజ్‌ తీర్చుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. హుజూర్‌ నగర్‌ టికెట్‌ విషయంలో ఉత్తమ్‌ తీరును రేవంత్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉత్తమ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ స్థానం నుంచి తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేస్తుందని ఉత్తమ్‌ ఏ ప్రాతిపదికన ప్రకటించారని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియాను కలిసి అభ్యంతరం తెలిపారు. రేవంత్‌ ఫిర్యాదు మేరకు కుంతియా ఈ అంశాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ దష్టికి తీసుకెళ్లనున్నారు.
అటు.. యురేనియం అంశంపైనా కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం తీరును నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జనసేన నిర్వహించిన అఖిలపక్ష భేటీకి టీపీసీసీ నేతలు పిలవగానే ఎలా వెళ్లారని కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ ప్రశ్నించారు. యురేనియం తవ్వకాల అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీయే ముందుకు తీసుకొచ్చిందని.. ఈ పోరాటంతో జనసేనకు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. సీనియర్‌ నేతలంతా వెళ్లి పవన్‌ వద్ద ఎలా కూర్చుంటారని నిలదీశారు. సంపత్‌ లేవనెత్తిన అంశాన్ని కుంతియా సానుకూలంగా పరిశీలించినట్లు సమాచారం.
అందుకు ప్రతీకారంగానేనా..?
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి అప్పగిస్తారంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రేవంత్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ టీపీసీసీ పదవిని రేవంత్‌ రెడ్డికి కన్ఫార్మ్‌ చేసిందని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర పార్టీ నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి దాదాపుగా ఖరారు కాగా.. పార్టీ సీనియర్‌ నేతలు చివరి నిమిషంలో దాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రేవంత్‌ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్‌నే వీరు ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నట్లు సమాచారం.
రేవంత్‌ రెడ్డికి పీసీసీ పదవీ బాధ్యతలు అప్పగించడాన్ని హనుమంతరావు తీవ్రంగా వ్యతిరేకించారు. వలస వచ్చిన నేతలకు పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్‌ నేతలకు కూడా దక్కని పదవిని ఈమధ్యే పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఎలా కట్టబెడతారంటూ ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి తన కాలేజీ రోజుల్లో కొంత కాలం బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆరెస్సెస్‌ భావజాలానికి ఆకర్షితులై ఆ నేతలకు సన్నిహితంగా వ్యవహరించారు. అనంతరం టీడీపీలో చేరి సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీ కోసం పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఏబీవీపీ, ఆరెస్సెస్‌ భావజాలాలున్న నేత కాంగ్రెస్‌ సంస్క తికి సరితూగరని హనుమంతరావు వాదించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవిని మార్చాలనుకుంటే పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న ఎంతో మంది సీనియర్‌ నేతలు ఉన్నారని.. అలాంటి వారిలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా సమ్మతమేనని ఆయన వివరించినట్లు సమాచారం.
హనుమంతరావుతో పాటు ఉత్తమ్‌, భట్టి విక్రమార్క కూడా రేవంత్‌ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు అందించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీపీసీసీ చీఫ్‌కు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ రేవంత్‌ రెడ్డి దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఓ ప్రణాళిక ప్రకారం తాను, తన వర్గంతో ఉత్తమ్‌ను రేవంత్‌ టార్గెట్‌ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ పార్టీలోనూ సీనియర్‌ నేతలందరినీ వెనక్కి నెట్టి ఆయన ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అలాంటి రేవంత్‌.. ఈసారి ఉత్తమ్‌ను కోలుకోకుండా బుక్‌ చేస్తారో లేదో వేచి చూడాలి అని రాజకీయ మేధావులు ఎదురుచూస్తున్నారు.
బీజేపీ గాలం
ఇప్పటికే తెలంగాణలో రెండవ స్థానంలో పఠిష్టంగా ఉన్న బీజేపీ అటు టీఆర్‌ఎస్‌ని ఇటు కాంగ్రెస్‌ను ఏకకాలంలో ఇరుకునపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముందుగా పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసే పనిలో బిజీబిజీగా ఉంది. టీఆర్‌ఎస్‌ సంగతి పక్కపపెడితే కాంగ్రెస్‌లో వర్గపోరాటాలు, ముఠా తగాదాలకు తక్కువేమీ లేదు. ఆ మాటకొస్తే ఆధిపత్యం విషయంలో ఎవరికివారే సీనియర్లు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్‌ నేతలు డీకే అరుణ, కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డి వంటి నేతలను వదులుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తునే ఉంది. పార్టీలో ఉన్న పది మంది లీడర్లూ తలోమాట తలోదిక్కు అన్న చందాన సాగుతోంది.
ఇప్పుడు హుజూర్‌ నగర్‌ సీటు విషయంలో రాజుకుంటున్న అగ్గిని బీజేపీ మరింత రాజేయాలని చూస్తోంది. దీనిని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రేవంత్‌తో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. బీజేపీలో ఒకవేళ రేవంత్‌రెడ్డి లాంటి నేత వస్తే పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అగ్రనేతలు ఎవరూ రేవంత్‌ రెడ్డి విషయంలో సానుకూలంగా లేరన్నది వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది.
పద్మావతే అభ్యర్థి..?
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నాటి నుంచే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే ఆలోచన లేదని ఉత్తమ్‌ మొదట్లో చెప్పడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, స్థానిక నేతలు, కేడర్‌ అభిప్రాయం ప్రకారం పద్మావతే అక్కడ సరైన అభ్యర్థి అనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఉత్తమ్‌తో పాటు మంచి పరిచయాలున్న ఆమె అయితే టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వొచ్చని, కచ్చితంగా గట్టెక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారనే సంకేతాలను ఉత్తమ్‌ పంపారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలను ఖండించారు. హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా ఎవరినీ ఖరారు చేయలేదని ప్రకటించారు.

హైకమాండ్‌ చెప్పాలి కదా?
హుజూర్‌నగర్‌ బరిలో పద్మావతి ఉంటారని ఉత్తమ్‌ ఎలా చెబుతారని, అసెంబ్లీ అభ్యర్థిత్వాలను పార్టీ హైకమాండ్‌ ప్రకటిస్తుందనే వాదన కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతోంది. ఉత్తమ్‌ ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలసి రేవంత్‌ చర్చించారని, పద్మావతి అభ్యర్థిగా ఖరారైనా కూడా ఉత్తమ్‌ ప్రకటించడమేంటని ప్రశ్నించినట్లు గాంధీభవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చామల కిరణ్‌రెడ్డిని తాను ప్రతిపాదిస్తున్నానని పేర్కొనడం మరింత వేడిని రాజేసింది. ప్రస్తుతానికి కొంత గందరగోళం ఉన్నా కాంగ్రెస్‌ హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా పద్మావతి పేరే చివరకు ఖరారవుతుందని సమాచారం.
సెల్ఫీ కావాలంటే వారినే అడగాల్సింది : రేవంత్‌రెడ్డి
‘పవన్‌ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు సెల్ఫీ దిగే అవకాశం రాకపోతే నేనేం చేయాలి. దానికి టీపీసీసీ చీఫ్‌నే అడగాల్సింది’ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యురేనియం తవ్వకాలపై పార్టీ తరఫున ఓ కమిటీని వేసి దాని చైర్మన్‌గా వీహెచ్‌ ను పీసీసీ అధ్యక్షుడు నియమించారు. వాళ్లిద్దరూ హాజరైన సమావేశానికి నేను కూడా వెళ్లాను. యురేనియం తవ్వకాలతో ప్రభావితమయ్యే ప్రాంతంలో నా సొంతూరు ఉందనే ఆవేదనతో వెళ్లా. అక్కడకు సంపత్‌ రావడం ఎందుకు.. పవన్‌తో సెల్ఫీ దిగాలని అనుకుంటే టీపీసీసీ అధ్యక్షుడిని అడగాల్సి ఉండే’ అని అన్నారు. రేవంత్‌ మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అటుగా వచ్చారు. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వదిలేసి నన్ను రాజగోపాల్‌రెడ్డి సోదరుడి గా దత్తత తీసుకున్నారని రేవంత్‌ అన్నారు.