విద్యుత్‌పై చర్చకు ఎందుకు రాలేదు?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రేవంత్‌రెడ్డి హితవు

హైదరాబాద్‌: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు 14 రోజుల కంటే తక్కువగా జరిగితే అది చెల్లదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ రూల్స్‌ బుక్‌లోనే ఈ నిబంధన ఉందని చెప్పారు. రెండు పార్టీలు ఒప్పుకుంటే సరిపోదని.. సమావేశాలు 14 రోజులకు తక్కువ జరగడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన మాట్లాడారు. సభలో విద్యుత్‌పై చర్చ జరిగేటప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరికాదని.. ఆ విషయాన్ని తమ ఎమ్మెల్యేలకు అడిగేందుకే అసెంబ్లీకి వచ్చానని రేవంత్‌ అన్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తమ పార్టీ నేతలు వెళ్లారని, దీనిపై తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌లో పదవి ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక టికెట్‌ను అధిష్ఠానం ఇంకా ఎవరికీ కేటాయించలేదన్నారు. ఆ స్థానానికి శ్యామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు రేవంత్‌ చెప్పారు. యురేనియంపై తమ పార్టీ నేత సంపత్‌ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ టికెట్‌ను ఉత్తమ్‌ పద్మావతికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి శ్యామల కిరణ్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు రేవంత్‌ పేర్కొనడం చర్చనీయాంశమైంది.