పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ ఏది?

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరు పని చేస్తున్న ప్రదేశాలను గ్యాస్‌ చాంబర్లతో పోల్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కే కే వేణుగోపాల్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏ దేశంలోనూ మరణించేందుకు ప్రజలను గ్యాస్‌ ఛాంబర్లలోకి పంపించరని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మన దేశంలో నెలకు దాదాపు నలుగురైదుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తున్నారని పేర్కొంది. మురుగు కాలువలు, మ్యాన్‌హోల్స్‌ను కాయకష్టంతో శుభ్రం చేసేవారికి రక్షణ కల్పించేందుకు ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్క్‌లు వంటివాటిని ఎందుకు అందజేయడం లేదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయినప్పటికీ, కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. మానవులంతా సమానమేనని, వారికి సమాన సదుపాయాలను అధికారులు కల్పించడం లేదని పేర్కొంది. మాన్యువల్‌ స్కావెంజర్స్‌ను నియమించుకోవడంపై 1993లో నిషేధం విధించారు. కాయకష్టంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేవారి పునరావాసం కోసం 2013లో చట్టాన్ని ఆమోదించారు. అయినప్పటికీ దేశంలో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ కొనసాగుతోంది.