వాడివేడి ‘విమోచనం’
ఊరినిండా జాతీయ జెండాలతో బీజేపీ: నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
- అధికారికంగా జరపాలని సర్కారుపై ఒత్తిడి
- పార్టీ బలోపేతానికి బీజేపీకి దొరికిన అస్త్రం
- జూన్ 2 తెలంగాణ రాష్ట్ర దినోత్సవం : కేసీఆర్
- బీజేపీ బహిరంగ సభకు అమిత్‌షా గైర్హాజరు
- స్థానిక నేతలతో వాడవాడలా జాతీయ జెండాల ఆవిష్కరణ
- నేడు రాష్ట్రవ్యాప్తంగా కమలనాధుల నిరసన ప్రదర్శనలు
- కేసీఆర్ సర్కారును ఇరుకునపెట్టే యత్నం
- జల్లా కేంద్రాల్లో త్రివర్ణ పతాకాలతో బీజేపీ బైక్ ర్యాలీలు
- బీజేపీకి దీటుగా టీఆర్‌ఎస్ పోటాపోటీ ర్యాలీలు
హైదరాబాద్:
తెలంగాణలో ఇప్పుడు రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపించేసుకుని ఎలాగోలా బయటపడ్డ టీఆర్‌ఎస్… సార్వత్రికంలో తగిలిన దెబ్బలతో విలవిల్లాడుతోందనే చెప్పక తప్పదు. ఇలాంటి కీలక తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ… ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే సింగరేణి కాలరీస్ లోని టీఆర్ ఎస్ కు చెందిన గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)ను రెండుగా చీల్చేసిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ విమోచన దినం వేదికగా తనదైన వ్యూహాత్మక రాజకీయాన్ని మరింతగా వేడెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. వరుసగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంతో నిజంగానే టీఆర్ ఎస్ కు ఊపిరాడట్లేదన్న విశ్లేషణలు బాగానే వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచన కలిగిందని – ఆ సందర్భంగా ఆ రోజు తెలంగాణ విమోచన దినం పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీ.. ఏళ్ల తరబడి ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ అడ్డగింతలు ఎదురవుతున్నా కూడా బీజేపీ వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో ఈ దఫా తెలంగాణ విమోచన దినం వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బీజేపీ… ఇప్పుడు అదే డిమాండ్ తో శనివారం కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తో కూడిన బీజేపీ ప్రతినిధి బ ందం రాజ్ భవన్ కు వెళ్లి మరీ గవర్నర్ ను కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా కేసీఆర్ సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా వారు గవర్నర్ ను కోరారు.
ఇదేదో రోటీన్ వ్యవహారంలాగే కనిపిస్తున్నా… బీజేపీకి చెందిన తమిళిసై గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమెతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం – తొలి భేటీలోనే కీలక అంశాన్ని ప్రస్తావించడం చూస్తుంటే… తెలంగాణ విమోచన దినం వేడుకలను వేదికగా చేసుకుని బీజేపీ భారీ ప్లాన్ నే రచించినట్లుగా తెలుస్తోంది. రజాకార్ల దాష్టీకాల నుంచి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణను దేశంలో కలిపేసిందని ఈ సందర్భాన్నే… తెలంగాణ విమోచన దినంగా పాటిస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. అదే సమయంలో తెలంగాణ విమోచన దినం అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న మజ్లిస్.. విమోచన దిన వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ససేమిరా అంటోంది. ఇటు మిత్రపక్షం వద్దంటుంటే… అటు అంతకంతకూ బలపోతమవుతున్న రాజకీయ ప్రత్యర్థి బీజేపీ నిర్వహించాలని పట్టుబడుతుంటే… ఏం చేయాలో పాలుపోక టీఆర్‌ఎస్ నిజంగానే తల పట్టుకుంది.
ఈ తరహా పరిస్థితిపై పక్కాగానే వ్యూహాలను పకడ్బందీగా రచించుకున్న బీజేపీ… విమోచన దినం వేదికగానే టీఆర్‌ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ప్లాన్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందన్న విషయాన్ని పక్కనపెడితే… తెలంగాణ విమోచన దినం వేడుకల కోసం పట్టుబడుతున్న బీజేపీకి చెందిన నేతే ఇప్పుడు గవర్నర్ గా ఉన్న వేళ… ఆ విషయాన్ని ఎలా సైడ్ చేయాలన్న విషయం అర్థం కాక కేసీఆర్ కూడా అమోమయంలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ విమోచన దినం వేదికగా బీజేపీ రచిస్తున్న వ్యూహంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం బాగా వేడిక్కిపోయిందని చెప్పక తప్పదు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టింది. రజాకార్ల వ్యతిరేక పోరాటాలు జరిగిన, చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన స్థలాలను సందర్శిస్తోంది, సమావేశాలు నిర్వహిస్తోంది. రజాకార్లు 16 మందిని హత్య చేసిన మహబూబాబాద్ జిల్లాలోని దేవుని సంకీసలో సమావేశం నిర్వహించింది. 14న నిజామాబాద్ జిల్లాలో విమోచన దినోత్సవ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 16న బైరాన్‌పల్లిలో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లా అప్పంపల్లిలో, ఆసిఫాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లా వేయి ఊరుల మర్రిలో, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలో కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. వాటిల్లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొనేలా చర్యలు చేపట్టింది.
అన్ని బూత్‌ల్లో విమోచనకు ఏర్పాట్లు
17న ఊరినిండా జెండాలు కార్యక్రమం పేరుతో ప్రతి గ్రామంలోని అన్ని పోలింగ్ బూత్‌ల్లో విమోచన దినోత్సవాలు నిర్వహించాలని, అందులో భాగంగా ఉదయం 9 గంటలకు జాతీయ జెండాలు ఆవిష్కరించాలని నిర్ణయించామని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో త్రివర్ణ పతాకాలతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పటాన్‌చెరులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. సభకు కేంద్రమంత్రులు స్మ తి ఇరానీ, కిషన్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా అధికారిక కార్యక్రమాల కారణంగా 17వ తేదీన రాలేకపోతున్నారని, ఆ తరువాత రాష్ట్ర పర్యటనకు వస్తారని వివరించారు.
.తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ ప్రజలు రజాకార్ల అక త్యాలు, అరాచకాలు, అఘాయిత్యాల నుంచి విముక్తి పొందిన దినం. తెలంగాణ ప్రజల ధీరోదాత్త పోరాటానికి విజయం లభించిన దినం. అటువంటి సెప్టెంబర్ 17ను విజయోత్సవ దినోత్సవంగా, విమోచన దినోత్సవంగా జరుపుకోవాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్షం.
ఈ ఆకాంక్షను విస్మరించడం ఏ ప్రభుత్వానికైనా సరే తగదు. రజాకార్ల దౌర్జన్యాలకు ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడం, రాజాకార్లకు వ్యతిరేకంగా సాహసోపేతంగా ఎదురు తిరిగి బలిదానం చేసిన వారిని స్మరించుకోవడం…ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. దానిని విస్మరించడమంటే చరిత్రను మరచిపోవడమే అవుతుంది.
అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ వీరోచిత పోరాటాల చరిత్రను మరుగున పరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలను తెలంగాణ వారు ఎదుర్కొన్నారు. అభ్యంతర పెట్టారు. ప్రత్యేక తెలంగాణ వాదం బలమైన సెంటిమెంట్ గా ప్రజలలో పాదుకొనడానికి విమోచన దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం.
తెలంగాణ భాషను, యాసనే కాదు, చరిత్రనూ అపహాస్యం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రజాకాంక్ష నెరవేరి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా తెలంగాణ యోధుల చరిత్రను, వారి త్యాగాలను మరుగున పరిచే యత్నాలు కొనసాగడం శోచనీయం. తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణపై తెలంగాణ ఉద్యమ సమయంలో గొప్పగా మాట్లాడిన ఉద్యమ నాయకులు అధికారంలోనికి వచ్చిన తరువాత ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం దారుణం.
జాతీయోద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు నిజాం దుర్మార్గ పాలన, రాజాకార్ల అరాచకాలు, అక త్యాల నుంచి విముక్తి కోసం జరిపిన చారిత్రాత్మక పోరాటాన్ని నాడు జాతీయోద్యమ నాయకులు విస్మరించారు.
స్వాతంత్య్రం అనంతరం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా విస్మరించింది. చిన్నచూపు చూసింది. అయితే జనం మాత్రం ఆ పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను పదిలంగా గుండెల్లో దాచుకున్నారు. ఏటా విమోచన దినం రోజును ఘనంగా నిర్వహించుకుంటూ నివాళులర్పిస్తూ వచ్చారు.
కాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ను తెరమీదకు తీసుకువచ్చింది, తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాసయే. ఉద్యమ పార్టీగా తెరాస చేసిన డిమాండ్ ను ఆ పార్టీ అధికారంలోనికి రాగానే వదిలేసింది. రాజకీయ కారణాలతో చరిత్రను వక్రీకరించడం, విస్మరించడం ఎంతమాత్రం సమంజసం కాదు.
స్వాతంత్య్రానికి పూర్వం అప్పటి బ్రిటిష్ పాలకులు దేశంలో రైల్వేలు ఏర్పాటు కావడానికి, రోడ్లు, రహదారుల సౌకర్యానికి అభివ ద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. అందుకోసం ఇక్కడి జనాలను బానిసలుగా చూస్తుంటే, భారత్ పై పెత్తనం చేస్తుంటే ఊరుకున్నామా? దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఏ మాత్రం తక్కువ చేయడానికి వీలులేనిది తెలంగాణ విమోచన పోరాటం. అరాచకాలు, అక త్యాలు, అఘాయిత్యాలు వ్యతిరేకంగా సామాన్య జనం తిరగడి చేసిన పోరాటం.
పల్లె పల్లె తిరగబడింది. ఊరు, ఊరూ కదన కాంక్షతో కదిలింది. జనం స్వచ్ఛందంగా పెత్తందారీ తనాన్ని, దొరల దౌర్జన్యాలనూ ఎదిరించేందుకు అందిని ఆయుధాన్ని పట్టి తిరగబడ్డ పోరాటం అది. నిజమైన ప్రజా పోరాటం. నాటి పోరాట వీరులను స్మరించుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయం ఎందుకంటే దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఏడాదికి తెలంగాణకు దొరతనం నుంచీ, అరాచక పాలన నుంచి విముక్తి లభించింది. ఆ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత, నాటి పోరాటంలో త్యాగాలు చేసిన వీరులకు నివాళులర్పించాల్సిన బాధ్యత విస్మరించడం తగదు. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.