చిదంబరానికి ఈడీ షాక్‌

వ్యక్తిగత కార్యదర్శి కేవీకే పెరుమాళ్‌కు తాజాగా సమన్లు జారీ

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాక్‌ ఇచ్చింది. అప్పట్లో చిదంబరానికి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన కేవీకే పెరుమాళ్‌కు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈనెల 18న ఆయనను ఈడీ విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొంది. ఈడీ డిప్యూటీ డెరెక్టర్‌ మనీష్‌ గుప్తా, ఆర్‌.ఎస్‌.థపిలియాల్‌ కలిసి పెరుమాళ్‌ను విచారించనున్నారు. పెరుమాళ్‌ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, 2004 నుంచి ఆయన ప్రయాణించిన దేశాలకు సంబంధించిన వివరాలు, వీసాలు, పాస్‌పోర్టుల ఫోటోకాపీలను అందజేయాలని ఈడీ అధికారులు పెరుమాళ్‌ను కోరారు. ఆయన నుంచి 40 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని కూడా ఈడీ పట్టుదలగా ఉంది. గతంలో ఈడీ రెండు సార్లు ఆయనను విచారించినప్పటికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని ఈడీ చెబుతోంది.
కాగా, ఇటీవల సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా చిదంబరం తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌కు ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులు ఆమోదం తెలిపారని, తన క్లయింట్‌ ఒక మంత్రిగా కేవలం సంతకం చేశారని అన్నారు. చిదంబరం సైతం ఇటీవల ఓ ట్వీట్‌లో… ఈ కేసులో ఏ ఒక్క అధికారి అరెస్టు కాలేదని, వారెవరూ తప్పు చేయకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి చిదంబరం వ్యక్తిగత కార్యదర్శికి ఈడీ తాజాగా సమన్లు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.