మోస్ట్‌ వాంటెడ్‌ హతం

లష్కరే ఉగ్రవాది ఆసిఫ్‌ను మట్టుబెట్టిన భారత సైన్యం

శ్రీనగర్‌: అధికరణ 370 రద్దు తర్వాత ఓ పండ్ల వ్యాపారి కుటుంబంపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 30నెలల అస్మాజాన్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సైన్యం రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకొంది. ఈ దాడికి కారణమైన మోస్ట్‌ వాంటెడ్‌ లష్కరే టెర్రరిస్ట్‌ ఆసిఫ్‌ను బుధవారం భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం ఈరోజు ఉదయం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య సోపోర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆసిఫ్‌ ఘటనా స్థలంలోనే మ తి చెందాడు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆసిఫ్‌ ఓ కారులో ప్రయాణిస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే, అతను కారు ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో బలగాలు అతన్ని వెంబడించడంతో వారిపై ఆసిఫ్‌ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించారు. అధికరణ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో చిన్నారి అస్మాజాన్‌ కుటుంబీకులు ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా పండ్ల దుకాణాన్ని తెరిచారు. దీంతో వారిపై కక్షకట్టిన లష్కరే ఉగ్రవాది ఆసిఫ్‌, అతని సహచరులు ఇటీవల అస్మాజాన్‌ కుటుంబంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 నెలల వయస్సున్న అస్మాజాన్‌ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఇటీవల ఓ వలస కూలీపై జరిగిన దాడిలోనూ ఆసిఫ్‌ హస్తం ఉందని పోలీసులు తెలిపారు. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాక్‌ ఏదో విధంగా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను తరలించింది. వారు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లష్కరేలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆసిఫ్‌ ఎన్‌కౌంటర్‌ ఉగ్రమూకలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరోవైపు లష్కరే ఉగ్రసంస్థకు చెందిన ఎనిమిది మంది సానుభూతిపరుల్ని పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.