రామన్న..కంటతడి

మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించింది: జోగు రామన్న

ఆదిలాబాద్‌: తెరాస నేత, మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతం వీడి ఆదిలాబాద్‌కు వచ్చారు. మంత్రివర్గ విస్తరణ రోజు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన మంత్రి పదవి దక్కుతుందని ఆశించానని.. రెండుసార్లూ తనకు ఆ పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి పదవి దక్కకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని స్పష్టంచేశారు. ఆదివారం అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లానన్న రామన్న.. వైద్యుల సూచన మేరకే తన ఫోన్‌ స్విచాఫ్‌ చేశానని వివరణ ఇచ్చారు. రామన్న వచ్చారని తెలుసుకున్న అనుచరులు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామన్నకు మంత్రి పదవి దక్కలేదని ప్రశాంత్‌ అనే యువకుడు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికిపాల్పడ్డాడు. దీంతో ప్రశాంత్‌ను అడ్డుకొని ఆయన అనుచరులు సముదాయించారు.
అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సష్టించిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం మీడియా ముందుకు వచ్చిన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉండేనని, అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు. బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం తనకు లేదన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆరే తమ నాయకుడు అని రామన్న అన్నారు.