హరీష్‌కు ‘ఆర్థిక’ పరీక్ష!

కొత్త ఆర్థిక మంత్రికి నిధుల లేమితో తంటాలు

  • పదవేదైనా పనితనమే ధ్యేయం
  • తనదైన మార్కుతో ముద్ర
  • హరీష్‌ ముందు మాంద్యం ముప్పు
  • పేరుకుపోయిన అప్పులు..నిధుల లేమి
  • రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకేనా?
  • ఐదేళ్లుగా తీవ్రంగా నిధుల కొరత
  • నీటిపారుదల శాఖతో మంచి గుర్తింపు
  • ఆర్థిక శాఖపైనా అదే స్థాయి కృషి
  • బకాయిల చెల్లింపులపై ఒత్తిడి
  • ప్రజా సంబంధాలకు దూరమేనా?

హైదరాబాద్‌:
దాదాపు పది నెలల పాటు నియోజకవర్గానికే పరిమితమైన హరీశ్‌రావును, ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకున్నట్టు? మంత్రిపదవి ఇచ్చి గౌరవించారని ఆయన అభిమానులు సంతోషించాలా? లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రంలోని పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యతను అప్పజెప్పారనుకోవాలా? నిజంగా ఆయన పనితీరుకు పరీక్ష పెట్టడమేనా? లేక ఇంతకాలం హరీశ్‌రావును పక్కన పెట్టారని పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చను, అసంతప్తిని చల్లార్చే ప్రయత్నంలో భాగమా? అనే అనుమానాలు, ప్రశ్నలు, హరీష్‌ రావు అభిమాన వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్‌ మీడియాలోనైతే, ఎవరికివారు తమకు తోచిన భాష్యం జోడిస్తున్నారు. దీంతో హరీష్‌రావుకు ఆర్థిక శాఖపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టినందుకు ఇంతకాలం ఒక లాంటి చర్చ జరిగితే, ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినందుకు మరో రకమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో సమర్ధుడిగా గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు ఆర్థిక శాఖను అప్పజెప్పడం ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీళ్ళ కోసం సాగునీటిపారుదల శాఖను హరీశ్‌కు కేటాయించారు. ఆయన పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరిగాయి. తాజాగా ఇప్పడు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మరోసారి కీలకమైన బాధ్యతను అప్పగించారు కేసీఆర్‌. ఒకవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోతుండటం, నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుండటం, రాష్ట్ర ఆర్థిక వనరులు కుంచించుకుపోతుండటం, గడచిన ఐదేళ్ళలో అప్పులు భారీ స్థాయిలో పెరగడం, వాటిని వడ్డీతో సహా చెల్లించే భారం మీద పడటం, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మరింతగా అప్పులు చేయాల్సి రావడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికంటే ఎక్కువ అప్పులు చేయాల్సి రావడం, ఇలా అనేక సవాళ్ళ నేపథ్యంలో, హరీష్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వీలైనంత ఎక్కువ స్థాయిలో గ్రాంట్లు, ఆర్థిక సాయాన్ని తీసుకురావడం, వివిధ రూపాల్లో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వివిధ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు సమకూర్చుకోవడం, రాష్ట్ర అవసరాలపై స్పష్టత ఉన్న దష్ట్యా, పరిమిత ఆర్థిక వనరులను సమర్ధవంతంగా కేటాయించడం హరీశ్‌రావు ముందున్న ప్రధాన సవాళ్ళు అంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పథకాలను అమలుచేయడం, వాటికి నిధులను విడుదల చేయడం హరీష్‌ రావుకు కత్తిమీద సాము అంటున్నారు సెక్రటెరియట్‌ వర్గాలు. రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావు, ఈ బాధ్యతల్లో ఏ మేరకు సక్సెస్‌ సాధిస్తే, భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రాధాన్యత ఆ మేరకు పెరుగుతుందని కూడా అంటున్నారు ఆయన వీరాభిమానులు. చూడాలి, హరీష్‌ రావుకు ఆర్థిక శాఖ ముళ్లకిరీటం అవుతుందో లేదంటే పట్టిందల్లా బంగారమైనట్టు బంగారు కిరీటమవుతుందో.
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న హరీష్‌ రావుకు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంధ్యం పరిస్థితుల గురించి బడ్జెట్‌ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయినా రాష్ట్రాన్ని పురోగమన బాటలో నడిపిస్తున్నామని, సంక్షేమ పథకాలకు ఢోకా లేకుండా చూస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ట్రబుల్‌ షూటర్గా పేరుగాంచిన హరీష్‌ రావుకు కీలక ఆర్థిక శాఖను కేటాయించడం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. హరీష్‌ రావుకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆయన అభిమానులు కొందరు సంత ప్తి వ్యక్తంచేస్తుండగా..మరికొందరు మాత్రం ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఈ శాఖ బాధ్యతల నిర్వహణ హరీష్‌కు కత్తిమీద సామే అంటున్నారు. తెలంగాణ ఆర్థిక అవసరాలపై హరీష్‌ రావుకు సమగ్ర అవగాహన ఉందని, ఇది అక్కరకు వస్తుందన్న నమ్మకంతోనే ఆ శాఖ బాధ్యతలను ఆయనకు సీఎం కేసీఆర్‌ కట్టబెట్టారని అభిప్రాయపడుతున్నారు. మాంద్యం పరిస్థితులను అధిగమించి తెలంగాణలో సంక్షేమం, అభివద్ధిని సరైన నడపగల సామర్థ్యం హరీష్‌ రావుకు ఉన్నాయని చెబుతున్నారు. హరీష్‌ రావు శక్తి, సామర్థ్యాలపై నమ్మకంతోనే ఆయనపై సీఎం కేసీఆర్‌ పెద్ద భారాన్ని మోపారని అంటున్నారు.
అయితే హరీష్‌ రావు అభిమానుల్లో మరికొందరు మాత్రం హరీశ్‌ రావుకు ఆయన గతంలో నిర్వహించిన నీటిపారుదల శాఖను కేటాయించి ఉంటే బాగుండేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడంతో హరీష్‌ రావు ప్రత్యేక చొరవ చూపారని గుర్తు చేస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆర్థిక శాఖ ఏ విధంగానూ దోహదపడే అవకాశమే లేదని చెబుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా గొప్పపేరు సాధించిన హరీశ్‌ రావుకు…ఆర్థిక శాఖ రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుందని అంటున్నారు. ప్రజా నాయకుడిగా హరీష్‌ రావు పేరు సాధించేందుకు ఆర్థిక శాఖ బాధ్యతలు అక్కరకు రాదని చెబుతున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతల కారణంగా హరీశ్‌ రావు ప్రజల మధ్య తిరగలేరని, ఆఫీస్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో క్రమంగా హరీశ్‌ రావు కార్యకర్తలకు దూరమయ్యే పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చుని కొందరు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయపడులున్నారు. అయితే ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టినంత మాత్రానా కార్యకర్తలకు దూరమవుతారనుకోవడానికి లేదు అనేది మరో వాదన. ఆర్థికమంత్రిగా కొత్త సంస్కరణలు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరోసారి అందరి అభిమానాన్ని చూరగొనే అవకాశం ఉందంటున్నారు. పదవీ బాధ్యతలు చేపడుతూనే.. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా హరీష్‌ రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకోగలరని చెబుతున్నారు.
ఆర్థిక శాఖతో అంతగా పేరు రాదని హరీష్‌ అభిమానులు అసంతప్తి ..
తాజాగా, మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మాజీ మంత్రి, ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావుకు మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్‌ హరీష్‌ రావుకు ఏకంగా ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే, కీలక శాఖే దక్కినా హరీష్‌ అభిమానులు మాత్రం హరీష్‌ రావు కు కేటాయించిన శాఖపై అసంత ప్తితోనే ఉన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన కాలంలో హరీష్‌కుచాలా మంచి పేరు వచ్చిందని, ఆర్థిక శాఖతో అంతగా పేరు రాదని వారు అభిప్రాయపడుతున్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడు హరీష్‌ రావు ప్రాజెక్టుల వద్ద పనులను పరుగులు పెట్టించారు. ఇక ఆయన ప్రాజెక్టుల వద్దే నిద్ర పోయిన సందర్భాలు ఉన్నాయి. అవి ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేందుకు దోహదపడటమే కాకుండా, హరీష్‌ సంకల్పానికి నిదర్శనంగా మారాయి. అయితే, ఇప్పుడు ఆర్థిక శాఖ వల్ల పెద్దగా ప్రజల్లో తిరిగే అవకాశం ఉండదని, ఫైళ్లపై సంతకాలు పెట్టే వరకే పరిమితం అవుతారని హరీష్‌ అభిమానులు కాస్త అసంత ప్తితోనే ఉన్నారు.
ఇక తాజాగా సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం హరీష్‌ రావును అడకత్తెరలో పెట్టినట్లుగా చెప్పకనే చెబుతోంది. దేశంలోని ఆర్థిక మాంద్య పరిస్థితుల ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఉందని, ఇప్పుడొచ్చే ఆదాయం తగ్గిన నేపథ్యంలో రాబడి అంచనాల్ని తగ్గించిన ప్రభుత్వం, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు . ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. పాత బకాయిల్ని చెల్లించే వరకూ ఎలాంటి కొత్త పనులు చేపట్టమన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.
బకాయిల చెల్లింపే తొలి ప్రాధాన్యత అన్న కేసీఆర్‌ .. ఇరకాటంలో హరీష్‌
అంతేకాదు.. బడ్జెట్‌ పూర్తి కాపీని వెబ్‌ సైట్లో పెట్టేశాం.. వాటిని చూసుకోండన్న మాటను చెప్పిన కేసీఆర్‌ స్పీచ్‌ మొత్తం విన్నాక.. కీలకమైన ఆర్థిక శాఖను మేనల్లుడు హరీశ్‌ కు కట్టబెట్టటం ద్వారా హరీష్‌ ను ఇరకాటంలో నెట్టారా అన్న భావన కలగక మానదు. ఎందుకంటే.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌కు ఉండాలి. ఇప్పటికే ఉన్న బకాయిల్ని చెల్లించటమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పిన కేసీఆర్‌ దాని తర్వాతే మిగిలిన అంశాల మీద ఫోకస్‌ చేస్తామని చెప్పారు.
ట్రబుల్‌ షూటర్‌కు ట్రబుల్‌
అంటే ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఖజానా తాళపు చెవులను హరీశ్‌ చేతికి ఇచ్చారు. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. ఇక దీంతో ఆర్థిక మంత్రిగా హరీష్‌ చేసే పని పెద్దగా ఏమీ ఉండదని కేసీఆర్‌ మాటలతో అర్థమవుతోంది. ఒకపక్క ఆర్థికమంత్రిగా ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం ఉండదు. మరోపక్క అద్భుతమైన పనితీరు చూపించడానికి రాష్ట్ర ఖజానాలో ఆదాయము లేదు. ఇక దీంతో సీఎం కేసీఆర్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావుకు ఆర్థిక శాఖను ఇచ్చి ట్రబుల్స్‌ క్రియేట్‌ చేశారని చెప్పొచ్చు.