త్వరలో ‘లగ్జరీ’ రైళ్లు
ముందుగా ఢిల్లీ-లక్నో రూట్‌లో ప్రయోగం
హైదరాబాద్ : ఐఆర్‌సీటీసి నిర్వహించనున్న ప్రైవేటు రైళ్ళలో విలాసవంతమైన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఐఆర్‌సీటీసీ నిర్వహించనున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ రూట్లల్లో త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ముందుగా ఢిల్లీ-లక్నో రూట్‌లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత… అవసరమనుకుంటే మార్పులు, చేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనుంది ఐఆర్‌సీటీసీ. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు లగ్జరీ సేవలు అందనున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో రైలు టికెట్ బుక్ చేసినవారికి… హోటల్ బుకింగ్స్, ట్యాక్సీ, బ్యాగేజ్ పికప్ అండ్ డ్రాపింగ్ వంటి సర్వీసులు లభించనున్నాయి. ఐఆర్‌సీటీసీ స్వయంగా ఈ సేవల్ని అందించనుంది. అంతేకాదు… అవసరమైనవారికి వీల్ ఛైర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక… ప్రయాణికులు కోరుకునే ఆహారాన్ని ఆర్డర్ మేరకు అందిస్తారు. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఇంటికి ట్యాక్సీ సేవల్ని అందించనున్నారు. వీటితోపాటు… ఇంటి నుంచి స్టేషన్‌కు బ్యాగేజ్ సర్వీసులు, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు, స్గషన్లలో వీల్‌ఛైర్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. మూడేళ్ల పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భారతీయ రైల్వే రెండు రైళ్లను ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. ఐఆర్‌సీటీసీ నడపించబోయే ప్రైవేట్ రైళ్లపై ఇటు ప్రయాణికుల్లో కూడా ఆసక్తి నెలకొంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్‌లైన్స్ తరహాలో డైనమిక్ ఫేర్ విధానముంటుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. అంటే ఫ్లైట్ ఛార్జీలు గంటగంటకు మారినట్టు, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలు కూడా మారుతుంటాయన్న మాట. ఇక ఈ ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటాలు ఉండవని తేలిపోయింది. అయితే… ఒకవేళ రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్‌లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది