రామమందిరం తథ్యం

శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే

ముంబై: మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం తథ్యమని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే ధీమా వ్యక్తం చేశారు. శనివారంనాడిక్కడ మూడు మెట్రో లైన్ల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
‘ప్రధాని సమక్షంలో నేను మీకు హామీ ఇస్తున్నాను. ఆయన నాయకత్వంలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది’ అని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు. ప్రధాని ఇక్కడకు రాగానే ఎన్నిసార్లు, ఎన్నివిషయాల్లో మిమ్మల్ని అభినందించాలో తెలియడం లేదని తాను ఆయనతో అన్నానని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా హామీలిస్తూ వచ్చిన అంశాలన్నీ మోదీ నాయకత్వంలో కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారు. ‘370 అధకరణను రద్దు చేసినందుకు నేను గర్విస్తున్నాను. మేము ఆ హామీ ఇచ్చాం, నెరవేర్చాం. అలాగే అయోద్యలో రామాలయం కూడా కట్టితీరుతాం’ అని ఉద్ధవ్‌ అన్నారు. కాగా, ఇవాళ జరిగిన మూడు మెట్రో లైన్ల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తదితరులు పాల్గొన్నారు.