భారతీయులకు ప్రేరణ

ట్వీట్‌లో శాస్త్రవేత్తలను అభినందించిన రాహుల్‌

న్యూఢిల్లీ: చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి ఘట్టంలో విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిరాశను తొలగించేందుకు పలువురు వారికి భరోసాను అందిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చంద్రయాన్‌-2 ప్రయోగంపై స్పందించారు. ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఇది ప్రత్యేకంగా భారత్‌కు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తన ట్వీట్‌లో రాహుల్‌ ‘చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగస్వామ్యం వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇది భారతీయులకు ప్రేరణగా నిలుస్తుంది. మీరు పడిన శ్రమ వథా కాదు. ఇది అంతరిక్షంలో చేయాల్సిన ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని’ పేర్కొన్నారు.