కశ్మీర్‌ రక్షణకు కట్టుబడివున్నాం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌

న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలో అశాంతి రగల్చడానికి పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక మార్గం ఉగ్రవాదమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబల్‌ అన్నారు. పొరుగు దేశం ఎన్ని ఎత్తులు వేస్తున్నా.. కశ్మీర్‌ ప్రజలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సరిహద్దుల్లో 20 కిలో మీటర్ల మేర పాక్‌కు చెందిన సిగ్నల్‌ టవర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. వాటి ద్వారా కశ్మీర్‌లోని తమ వాళ్లకు సందేశాలు పంపుతున్నారన్నారు. వాటిని తాము పసిగట్టామని ఆయన తెలిపారు. యాపిల్‌ ట్రక్కులు సజావుగా ఎలా ప్రయాణిస్తున్నాయని.. వాటిని అడ్డుకోలేరా అంటూ ఇక్కడున్న తమవారికి పాక్‌ సందేశాలు పంపుతోందని ఆయన అన్నారు. లేకుంటే గాజులు పంపమంటారా? అంటూ వారిని ప్రశ్నిస్తున్నారని దోబల్‌ తెలిపారు.

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ విభజన నేపథ్యంలో కశ్మీర్‌ లోయలోనే అజిత్‌ దోబల్‌ ఉంటున్న విషయం తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు అందిస్తున్నారు.