ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
వివాహబంధంతో ఒక్కటైన స్వలింగసంపర్కులు
తిరువనంతపురం : ‘మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళకు చెందిన నికేశ్ ఉషా పుష్కరన్, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్ శ్రీకష్ణ గుడిలో తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని, తమ బంధానికి దేవుడు మాత్రమే సాక్షి అని తెలిపారు. ఈ విషయం గురించి నికేశ్ చెబుతూ..’ మాది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్. నేను గతంలో ఓ వ్యక్తితో పద్నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని మన బంధం గురించి అందరికీ చెప్పమని అతడిని అడిగాను. కానీ సమాజానికి భయపడి తను నాకు దూరంగా వెళ్లిపోయాడు. అలా దాదాపు రెండేళ్లపాటు నరకం అనుభవించాను. అందరిలాగా మాకు ప్రత్యేక మ్యాట్రిమొనీలు లేవు. అందుకే వ్యాపారంలో కాస్త తీరిక దొరికితే చాలు బెంగళూరు, తిరువనంతరపురం వెళ్లి నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడేమోనని వెదికేవాడిని. అలా ఓ ఎల్జీబీటీ సంస్థ ద్వారా సోను పరిచయమయ్యాడు. తను నాకంటే ఐదేళ్లు చిన్నవాడు. రెండు రోజుల చాటింగ్ చేసిన తర్వాత ప్రత్యక్షంగా తనను చూశాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పినపుడు చాలా భయపడింది. అమెరికా లేదా యూకేకు వెళ్లి అక్కడే ఉండమని సలహా ఇచ్చింది. ఇండియాలో మాలాంటి వాళ్లను సమాజం గేలి చేస్తుందని, కుటుంబాన్ని వెలి వేస్తుందని ఆమె భయం. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా హక్కు. అందుకే మేమిద్దరం గుడిలో దేవుడి ఎదుట ఉంగరాలు మార్చుకున్నాం. కారు పార్కింగ్ ఏరియాలో ఒకరి మెడలో ఒకరం తులసిమాలలు వేసుకుని దంపతులమయ్యాం’ అని ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సోను.. తన 29వ ఏట వధువు వెతుకుతున్న సమయంలో తల్లిదండ్రులకు తన గురించిన నిజాన్ని చెప్పాడన్నాడు. మొదట వాళ్లు భయపడినప్పటికీ.. తన వల్ల ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని ఆలోచించిన తనను ప్రశంసించారని చెప్పుకొచ్చాడు. నికేశ్, తాను ప్రస్తుతం కొత్త జీవితం గడుపుతున్నామని, అయితే పిల్లలు లేని లోటు, చట్టబద్ధత లేని వివాహం తమను వేదనకు గురిచేస్తుందన్నాడు.
కాగా ఈ విషయమై ఎల్జీబీటీ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయని, తాము కూడా ఇందులో సగర్వంగా భాగస్వాములమవుతామని నికేశ్, సోను పేర్కొన్నారు. తాము ఇప్పుడు అనుభవించే కష్టాలు భవిష్యత్ తరాలు పడకూడదనే తమ పోరాటం ఉధ తం చేస్తామని వెల్లడించారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సెప్టెంబరు 6 తమ జీవితాల్లో వెలుగునింపిందని అయితే తమ మనుగడకు ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. కాగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మ తి(ఐపీసీ)లోని సెక్షన్ 377 రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబరులో తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.