పాక్‌..కుట్ర భగ్నం

పట్టుబడిన ఉగ్రవాదులనుంచి కీలక సమాచారం

శ్రీనగర్‌:
సుమారు 50 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని కశ్మీర్‌లో చొరబాటుకు యత్నించిన పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు తెలిపారు. పాక్‌ ప్రేరేపిత లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులను భారత సైన్యం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దాదాపు 50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం వీరిని జమ్మూకశ్మీర్‌లోకి పంపించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరితోపాటు సుమారు 100 మంది ఎన్‌ఎస్‌జీ కమాండోలు శిక్షణ తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. కాగా.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని పాక్‌ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పాక్‌ పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది.
కశ్మీర్‌లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఖలీల్‌ అహ్మద్‌, మోజామ్‌ ఖోకర్‌ అనే ఇద్దరు పాకిస్థానీయులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని విచారించగా లష్కరే తోయిబాకు చెందిన 50మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ఎదరుచూస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ వీరికి సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ 50 మంది ఉగ్రవాదులకు పాక్‌ సైన్యం శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తర్వాత వారందరినీ రేషియన్‌ గలీ, కద్లాన్‌ గలీ ద్వారా జమ్మూ కశ్మీర్‌లోకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరితో పాటు మరో 80-90మంది ఎస్‌ఎస్‌జీ కమాండోలు ముజఫర్‌బాద్‌లో శిక్షణ పొందుతున్నారు. వీరిని హాజీపూర్‌ నాలా వద్ద ఉన్న భారత భద్రతా దళాలకు వ్యతిరేకంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భారత ఆర్మీ నుంచి రక్షణ పొందడానికి జ్యూరా, జబ్బర్‌లోయ ప్రాంతాల్లో కాంక్రీట్‌ బంకర్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ వెంబడి ఇప్పటికే భారీగా ఉగ్రవాదులు మోహరించి ఉన్నారు. పీవోకేలోని మూడు చోట్ల ఐఎస్‌ఐ, పాక్‌ ఆర్మీ ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీఓకేలోని లిపా లోయలో సుమారు 100మందికిపైగా ఉగ్రవాదులు మోహరించారు. వీరంతా జైషే మహమ్మద్‌, ఆల్బదర్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ లిపా లోయ..జమ్మూకశ్మీర్‌లోని ఉరి,తంగ్దార్‌ ప్రాంతాల సమీపంలో ఉంటుంది. మరో 60-70 మంది ఉగ్రవాదులు పీవోకేలోని లంజోట్‌, కలు స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కలు స్థావరం..జమ్మూకశ్మీర్‌లోని టైయిల్‌ సెక్టారుకు సమీపంలో ఉంటుంది.