కొత్తలో కంగారు సహజమే..

దక్షిణాఫ్రికా యువపేసర్‌ కాగిసో రబాడ

ప్రిటోరియా: భారత్‌లో తొలిసారి పర్యటించినప్పుడు ఏం చేయాలో అర్థంకాలేదని దక్షిణాఫ్రికా యువపేసర్‌ కాగిసో రబాడ అన్నాడు. కొంత కంగారు ఉంటుందన్నాడు. ఒక్కసారి అక్కడి పరిస్థితులు అలవాటు పడితే బాగా ఆడగలమని వెల్లడించాడు. గత అనుభవాలను ఉపయోగించుకొని ఈ సారి అదరగొడతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నెల 15 నుంచి సఫారీ జట్టు ఉపఖండంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. ‘జట్టు విజయావకాశాలను మెరుగుపరిచేందుకు ఏం చేయాలో ముందు ఆలోచించాలి. నేనిప్పుడు దానిపైనే దష్టి సారించా. ఉపఖండంలో ముందే ఆడిఉంటే కఠిన పరిస్థితుల్లో ఏం చేయాలో అవగాహన వస్తుంది’ అని రబాడ అన్నాడు. గత పర్యటనలో వన్డే, టీ20 సిరీసులు గెలిచిన సఫారీ జట్టు టెస్టుల్లో మాత్రం 3-0తో ఓటమి పాలైంది.
‘గత పర్యటనలో మేం విజయవంతం అయ్యాం. వన్డే, టీ20 సిరీసులు గెలిచాం. కానీ టెస్టు సిరీసులో ఓటమి పాలయ్యాం. ఎందుకంటే అప్పుడు పిచ్‌లు చాలా కఠినంగా ఉన్నాయి. ఉదాహరణకు అప్పుడు తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరిస్థితి 200 వర్సెస్‌ 200గా ఉంది. ఒకవేళ మేం మొదట బ్యాటింగ్‌ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. త్వరగా ఔటయ్యేవాళ్లం. ఈ మధ్యే కఠిన పరిస్థితులు ఉండే శ్రీలంక పర్యటన ముగించాం. స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారని అంతా ప్రశ్నించారు. కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఇంతకు ముందు అక్కడ ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. శ్రీలంకలో ఎలా ఆడాలో, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో వారు చెప్పారు. అవన్నీ పనిచేశాయి’ అని రబాడ అన్నాడు.