ఎన్‌ఆర్సీ తుది జాబితా విడుదల
జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందికి పైగా దక్కిన చోటు
న్యూఢిల్లీ: అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. చట్టబద్ధంగా నివసించే స్థానికులను గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ ప్రచురించిన ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందికి పైగా చోటు దక్కింది. 19 లక్షల మందికి పైగా స్థానం కోల్పోయారు. ఎన్‌ఆర్సీ తుది జాబితాలో 19,06,657 మందిని తొలగించినట్టు అసోం ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 3,11,21,004 మంది ఎన్నార్సీలో ఉన్నారనీ.. ఇందులో లేని వారికి భారత్‌లోని ఉన్నత న్యాయస్థానాలు సహా చట్టపరంగా అన్ని వినతులకు అవకాశం కల్పించినట్టు వెల్లడించింది. దీంతోపాటు జాబితాలో లేని వారికి జిల్లా న్యాయ సేవల యంత్రాంగం (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన న్యాయ సహాయం అందించాలని నిర్ణయించారు. కాగా ఎన్నార్సీ తుది జాబితా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 200 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. తుది జాబితాలో పేర్లు లేని వారికి అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సమాజంలో గందరగోళం స ష్టించేందుకు కొందరు ప్రచారం చేస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరింది.
అసోంలో ఇవాళ విడుదలైన జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాలో కార్గిల్ యుద్ధవీరుడు మహ్మద్ సనావుల్లాకు చోటు దక్కలేదు. ఆయన ఇద్దరు కుమార్తెలు, కుమారుడి పేర్లు కూడా జాబితా నుంచి గల్లంతయ్యాయి. అయితే ఆయన సతీమణికి మాత్రం తుదిజాబితాలో భారతీయురాలిగా చోటుదక్కింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌సీ జాబితాపై సనావుల్లా తీవ్ర అసంత ప్తి వ్యక్తం చేశారు. తన పౌరసత్వానిక సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉందనీ.. తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఆర్మీలో జేసీవోగా పదవీ విరమణ చేసిన సనావుల్లా ఈ ఏడాది మొదట్లో కూడా వార్తల్లో నిలిచారు. 1987 నుంచి మూడు దశాబ్దాల పాటు ఇండియన్ ఆర్మీలో పని చేసిన ఆయనను… అసోంకు చెందిన ఓ ట్రైబ్యునల్ విదేశీయుడనే ముద్ర వేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. అసోంలో అక్రమ వలసదారులను ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 1951 నాటి ఎన్‌ఆర్సీని తాజాగా నవీకరించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 3.11 కోట్ల మందికి పైగా చోటు దక్కింది. 19 లక్షల మందికి పైగా ఈ జాబితాలో స్థానం కోల్పోయారు.